శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ తప్పుల్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని అణచివేయాలని చూస్తోందని, తన అరెస్టు, జైలుకు పంపడం ఇందులో భాగమేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కుమారుడి రోడ్ యాక్సిడెంట్ కేసులో జైలుకు వెళ్లిన ఆయన ఇవాళ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకి వచ్చారు. అనంతరం శ్రీకాకుళంలోని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు వారి అభద్రతా భావానికి నిదర్శనమని, అలాగే వైఎస్సార్సీపీకి మంచి రోజులు వచ్చాయని ఇవి సూచిస్తున్నాయని సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రెస్ మీట్లో సీదిరి అప్పలరాజు ఇంకేమన్నారంటే.... జగన్ గారి మద్దతుకు ధన్యవాదాలు 23 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాను. నా కుమారుడి రిమాండ్ తో కలుపుకుంటే మొత్తం నెల రోజులు జైల్లో ఉన్నట్లు. ఇది నాకు, మా కుటుంబానికి కష్టకాలం. దేవుడి దయతో గౌరవ కోర్టు బెయిల్ మంజూరు చేశాక విడుదలైన నన్ను జిల్లాలో పార్టీ పెద్దలు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి, తిరిగి కార్యకర్తలతో మమేకం అయ్యేలా చేశారు. వారితో పాటు అనుక్షణం అండగా నిలిచిన పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యకర్తలు, నేతలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఈ కూటమి నాయకులు కూడబలుక్కొని, ఒక సాధారణ యాక్సిడెంట్‌ని నేరపూరిత కుట్ర అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి నన్ను జైలుకి పంపినా, రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా పార్టీ కార్యకర్తలు, తటస్ధులు, మేథావులు కూడా నా కోసం గొంతెత్తడం గర్వంగా అనిపించింది. పిల్లల మీద రాజకీయాలా, పిల్లల పైన కక్ష సాధింపా, కుటుంబాల పైన కక్ష సాధింపా అని వారు ప్రశ్నించారు. అసలు ఇంత పెద్ద కుటుంబం జగన్ మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారా అని గర్వంగా అనిపించింది. ప్రభుత్వం కక్షసాధింపులో భాగమే నా అరెస్టు ఇదేదో పోలీసులు పెట్టిన తప్పుడు కేసు అని చాలా మంది అంటున్నారు. నేను దానితో ఏకీభవించను. మా స్థానిక స్టేషన్‌లో ఉన్న పోలీసుల నుంచి, జిల్లా స్థాయిలో ఉన్నట్లు పోలీసుల వరకు కూడా, అందరూ కూడా నాకు సాయం చేశారు. కేసు ఏంటో, అదే చేశారు. దానికి సంబంధించినట్లు సెక్షన్‌లతోనే పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం నా మీద కక్షగట్టింది. అభద్రతా భావంతో వచ్చిన కక్ష అది. రాజకీయాల్లో తొక్కేసి, అణగదొక్కి, మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నట్లు ఆతృతతో చేస్తున్న పనులు ఇవి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, దాన్ని ఖచ్చితంగా పోలీసులు అమలు చేయాల్సిందే అన్నప్పుడు పెట్టిన ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్‌ని హత్యాయత్నంగా కేసులు పెట్టడం దేశంలో ఎక్కడైనా చూశామా మనం? ఇలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయి మన జిల్లాలోనే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల పిల్లలే చేస్తున్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజునే మా నియోజకవర్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. దానిలో ఎలా స్పందించింది? కానీ ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి, దాని పూర్వాపరాలు మాట్లాడడానికి మరి కొంత సమయం తీసుకుంటాను. కోర్టు గౌరవ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటిని వాటి గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. నిరసనల్ని తట్టుకోలేకపోతున్న సర్కార్ మొదట్లో ఒక భావన ఉండేది నాకు. జైల్లో పెట్టేసారే, నాకు గాని నా కొడుకుకి గాని నేను ఏం తప్పు చేశాను అని. కానీ జైల్లో పెట్టిన రెండో రోజునే కృష్ణ దాసు అన్న జైలుకు వచ్చి ములాఖత్ లో కలిసారు. ఆ సమయంలోనే ధర్మాన ప్రసాదరావు గారి సందేశం కూడా నాకు చెప్పారు. రాజకీయాల్లో ఇది భాగం అయినప్పటికీ, నిన్ను కక్షపూరితంగా జైల్లో పెట్టారని చెప్పారు. ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉద్యమం క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. ఆ ఉద్యమం ఎలా అవుతుందని నేను ఆలోచించాను. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అప్పుడే తెలిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా మత్సకార సామాజిక వర్గంలో ఎంతో చర్చ జరిగింది. ఆ తర్వాతే నేను సానుకూలంగా మారాను. ఇది నాకు, నా కుటుంబానికి ఓ దీక్ష లాంటి సమయమే. నన్ను జైల్లో పెట్టడమే కాకుండా, మా నాయకుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఎచ్చెర్ల గొర్ల కిరణ్ గారు, వాళ్ల బృందం మీద కేసులు పెట్టారు. తిలక్ గారు పలాస వస్తే వారందరి మీదా కేసులు పెట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తో పాటు ధర్మాన ప్రసాదరావు గారి అబ్బాయి మీద కూడా కేసులు పెట్టారు. ఆముదాలవలస చింతాడ రవిని అయితే ఏకంగా అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. దీనికి కారణం నా అరెస్టు తర్వాత ప్రజల్లో వచ్చిన నిరసన జ్వాలని ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందేమో అని అనిపిస్తోంది. దాన్ని చల్లార్చేందుకే అణచివేతను మార్గంగా ఎంచుకుంటున్నారు. వైఎస్సార్సీపీకి మంచి రోజులొచ్చాయ్ చంద్రబాబు తన అపార అనుభవాన్ని వాడి అణచివేత ధోరణితో ఇన్ని కేసులు పెట్టారు. అది చాలదు అన్నట్టు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రివ్యూ తీసుకోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. అంటే చంద్రబాబు గారు ఈ కూటమి నాయకులు ఎంచుకున్నట్లు మార్గం ఏంటంటే. మరింత అణచివేత ధోరణిలోకి మేము వెళ్తాము అని చెప్పి చాలా స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నారు. ఎక్కడైతే అణచివేత తీవ్రం అవుతుందో అక్కడ తిరుగుబాటు కూడా అంతకు మించి ఉంటుంది అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తిరుగుబాటు స్వరాలను మనం వింటూనే ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నట్లు ప్రజల యొక్క గర్జన ఎలా ఉందో మనం చూశాం. అంతకు ముందు దేవరపల్లి, రాజమండ్రి వచ్చినప్పుడు రైతుల్లో ఆ గర్జన ఎలా ఉందో చూశాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఇంత సుదీర్ఘమైన రోడ్ షో జరిగింది. ఇవన్నీ ప్రజల్లో ఉన్నట్లు ఆ నిరసన స్వరానికి ఓ నిదర్శనంగానే మనం భావించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో ప్రజలకి మంచి రోజులు వచ్చినట్టే మనం భావించాలి. మనం కేవలం ప్రతిపక్షంలోనే ఉన్నాం తప్ప మరి కొద్ది రోజుల్లో మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నాడు. దీనికి సంకేతంగానే వీటిని భావించాలని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.