నెల్లూరు: ఈనాడు దినపత్రికలో తనపై వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, ఆధారాల్లేకుండా రాస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల భూముల సేకరణ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రామదాసు కండ్రిగ వద్ద వంద ఎకరాల భూములకు సంబంధించి, రైతులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకు భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేశారని కాకాణి ఆరోపించారు. 2016లో రైతుల భూములను ఎకరాకు రూ.6 లక్షలకే తీసుకునేందుకు ఒత్తిళ్లు, బెదిరింపులు జరిగాయని, రైతులు తన వద్దకు వచ్చినప్పుడు వారికి అండగా నిలిచి న్యాయం చేసేందుకు పోరాడానని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం రైతులకు ఎకరాకు సుమారు రూ.15 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం చెబుతానని, అవసరమైతే సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రైతులను బెదిరించి భూములు తీసుకునే ప్రయత్నం 2016లో రైతుల భూములను ఎకరాకు రూ.6 లక్షల చొప్పున తీసుకునేందుకు ఒత్తిళ్లు, బెదిరింపులు జరిగాయి. భూములు ఇవ్వకపోతే పరిహారం ఇవ్వబోమని, రికార్డుల్లో పేర్లు తొలగిస్తామని రైతులను బెదిరించినట్టుగా అప్పటి రైతుల స్టేట్‌మెంట్లలోనే ఉంది. రైతులు నా దగ్గరకు వచ్చినప్పుడు భయపడొద్దని, పేదల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూస్తానని వారికి హామీ ఇచ్చాను. పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూములకు ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు రావాల్సిన పరిహారంలో కేవలం రూ.6 లక్షలు ఇచ్చి, మిగిలిన రూ.9 లక్షలు మధ్యలో కొట్టేయడానికి ప్రయత్నం జరిగింది. దాదాపు రూ.15 కోట్ల విలువైన వ్యవహారంలో రైతులకు నష్టం జరగకుండా నేను అడ్డుకున్నాను. ఖాళీ పేపర్లపై రైతుల సంతకాలు తీసుకోవడం, వారి బ్యాంకు ఖాతాలు, పాస్‌బుక్కులు, చెక్‌బుక్కులకు సంబంధించిన వ్యవహారాలు కూడా అప్పట్లో జరిగాయి. ఈ అంశాలకు సంబంధించిన రైతుల స్టేట్‌మెంట్లు, పాత రికార్డులు నా దగ్గర ఉన్నాయి. 100 ఎకరాల్లో 50 ఎకరాలు మాత్రమే పరిశ్రమకు మొత్తం 100 ఎకరాల భూమిలో 50 ఎకరాలను మాత్రమే పరిశ్రమ కోసం ఇవ్వగలిగాం. మిగిలిన 50 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను. పరిశ్రమల కోసం తీసుకున్న భూములను పారిశ్రామిక అభివృద్ధికే ఉపయోగించాలి, ఇతర ప్రయోజనాలకు మళ్లించకూడదు. మిగిలిన 50 ఎకరాల విషయంలో బంధువులు, అనుయాయుల పేరుతో వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. ఈ అంశాలకు సంబంధించిన వివరాలు విజిలెన్స్ రికార్డుల్లో కూడా ఉన్నాయి. 2004 విజిలెన్స్ రిపోర్టుపై ప్రశ్నలు నాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి 2004 నాటి విజిలెన్స్ రిపోర్టును ప్రస్తావిస్తున్నారు. భూమి విలువను ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తుంది? పరిహారం ఎలా చెల్లించారు? ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం సక్రమంగా జమ అయిందా లేదా? అనే అంశాలను ఎందుకు పరిశీలించడం లేదు? భూమి ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన విధానం ఉంది. గత మూడు సంవత్సరాల మార్కెట్ ధరలు, సగటు ధర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిహారం నిర్ణయిస్తారు. భూమి సేకరణ ప్రక్రియ ఎమ్మార్వో నుంచి ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ వరకు అనేక స్థాయిల్లో జరుగుతుంది. ఇంతటి అధికారిక ప్రక్రియలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం పూర్తిగా చెల్లించాం. తమ పేర్లు రికార్డుల్లో లేవని చెప్పిన రైతులకు కూడా అదనపు పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నాం. విజిలెన్స్ విభాగం తప్పుడు నివేదిక కనుపూరు గ్రామంలోని దేవాదాయ శాఖ భూములను ఆక్రమించి వైఎస్సార్సీపీ నాయకులు ఇళ్లు కట్టుకున్నారని వచ్చిన వార్తలు అవాస్తవం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించాం. అక్కడ లేఅవుట్ కూడా వేశాం. దేవాదాయ శాఖకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఇందులో మా పార్టీ నాయకుల ప్రమేయం ఏమీ లేదు. చందులూరు శ్రీనివాసులు అనే వైఎస్సార్సీపీ నేత ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు నిరాధారం. ఆ భూములకు సంబంధించిన పట్టాలు వెన్నుపోటు పార్టీ హయాంలో 2015, 2016, 2018 సంవత్సరాల్లో జారీ అయ్యాయి. (దానికి సంబంధించిన ఆధారాలను ఆయన ప్రదర్శించారు.). చంద్రబాబు ఆధీనంలోని విజిలెన్స్ విభాగం ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే తప్పుడు నివేదికలు ఇచ్చింది. సీబీఐ విచారణకు నేనే సిద్ధం నా హయాంలో ఏ ఒక్క రైతయినా తాను మోసపోయానని స్టేట్‌మెంట్ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతులకు నష్టం కలిగించేలా నేను వ్యవహరించానని నిరూపిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని నేనే హైకోర్టును ఆశ్రయించాను. నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నమ్ముతున్నవారు సీబీఐ విచారణకు సిద్ధపడాలి. దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ విచారణ వేయించండి. ఆ విచారణను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సర్వేపల్లిలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారంపై నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఏ విధంగా దోచుకుని సొమ్ము చేసుకుంటున్నారనే అంశంపై త్వరలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను. పాత రికార్డులు, ఆధారాలు, సంబంధిత వివరాలను ప్రజల ముందుంచి వాస్తవాలను వివరిస్తానని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.