టెట్‌ మినహాయింపు కోసం పోరాడిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు దుర్మార్గం

ఉపాధ్యాయుల గొంతు నొక్కేందుకు విద్యాశాఖలో ‘రెడ్‌బుక్‌’ అమలు చేస్తున్నారా?

ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి

లేకపోతే ఉపాధ్యాయులే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు

టీచర్స్‌ ఎమ్మెల్సీ కల్పలత

ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించాలన్న న్యాయమైన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీచర్స్‌ ఎమ్మెల్సీ కల్పలత పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే వారు చేసిన తప్పా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వరరెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వెంకట్నాథరెడ్డి, అమరనాథరెడ్డిలపై సస్పెన్షన్‌ వేటు వేయడం పూర్తిగా కక్షపూరిత చర్యగా కనిపిస్తోందన్నారు. లక్షలాది మంది ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్‌ సమస్యను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి వెళ్లిన కారణంగానే వారిపై చర్యలు తీసుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.

ఉపాధ్యాయుల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం తప్పా? టెట్‌ మినహాయింపు కోసం వినతిపత్రం ఇవ్వడం నేరమా? ఉపాధ్యాయుల తరఫున మాట్లాడిన వారిని సస్పెండ్‌ చేయడం చూస్తుంటే విద్యాశాఖలో కూడా రెడ్‌బుక్‌ రాజకీయాలు అమలు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి అని కల్పలత అన్నారు.

సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నారంటూ అభియోగాలు పేర్కొనడం పూర్తిగా తప్పుడు సమాచారంపై ఆధారపడిన చర్య అని ఆమె అన్నారు. సంబంధిత ముగ్గురు ఉపాధ్యాయులు డీఎస్సీ అంశంపై ఎక్కడా మాట్లాడలేదని, డీఎస్సీకి సంబంధించి ఎలాంటి వినతిపత్రం కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. వారు ప్రస్తావించిన ఏకైక అంశం ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌ సమస్యేనని తెలిపారు.

ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమ సహచరుల సమస్యలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సహజమైన ప్రజాస్వామ్య ప్రక్రియ అని కల్పలత పేర్కొన్నారు. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యల పేరుతో వేధింపులకు పాల్పడటం ఉపాధ్యాయుల్లో భయాందోళనలు సృష్టించడానికేనని విమర్శించారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, ఉపాధ్యాయుల హక్కుల కోసం మాట్లాడినా సస్పెన్షన్లు చేస్తామనే ధోరణి మంచిది కాదు. నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ కక్షలను విద్యాశాఖలోని ఉపాధ్యాయులపై ప్రయోగించడం వెంటనే ఆపాలి అని డిమాండ్‌ చేశారు.

సంగమేశ్వరరెడ్డి, వెంకట్నాథరెడ్డి, అమరనాథరెడ్డిలపై విధించిన సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కల్పలత డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని, సమయం వచ్చినప్పుడు ఉపాధ్యాయులే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Back to Top