రాజమండ్రి డాక్టర్‌ ప్రియాంక మృతి తీవ్రంగా కలచివేసింది

 వైయస్‌ జగన్‌

రాజమండ్రిలో మెడికల్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంక మృతి తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు ఈ విషాదం తీరని లోటని, ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డాక్టర్‌ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, నేర తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు దీనిని సాధారణ ప్రమాదంగా చూపించడం, నిందితులను వదిలేయడం దారుణమన్నారు. సీసీ కెమెరాల్లో ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో పోలీసుల నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాలు, ప్రశ్నించేవారిపై రాజకీయ కక్షసాధింపులకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తూ, సామాన్యుల కేసుల్లో మాత్రం చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వైయస్‌ జగన్‌ ఆక్షేపించారు. రాజకీయ పక్షపాతం, కక్షసాధింపులు వ్యవస్థల్లోకి చొరబడటం వల్ల ప్రజలకు న్యాయం అందించాల్సిన సంస్థల విశ్వసనీయత దెబ్బతింటోందన్నారు.

డాక్టర్‌ ప్రియాంక కేసులో ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్‌ జగన్‌ కోరారు.
 

Back to Top