తాడిపత్రి పోలీస్‌ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెట్టండి 

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌

అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడిపత్రిలో అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీస్‌ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. గోవా లిక్కర్‌ అక్రమ సరఫరాపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరుతున్నారని పెద్దారెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో ఎందుకు.. మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌లతో కమిటీ వేసి తాడిపత్రిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయించాలని అన్నారు.

తాడిపత్రి పోలీస్‌ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రిలోని పోలీస్‌ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెట్టండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డిని గ్యాంగ్‌స్టర్‌ తరహాలో తయారు చేశారని వ్యాఖ్యానించారు. 24 మంది వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అంతం చేస్తామని జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరిస్తున్నారని పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తాడిపత్రిలో వివాహ వేడుకలకు హాజరుకావాలన్నా జేసీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

గోవా లిక్కర్‌ కేసులో జేసీ తయారు చేసినట్లు చెబుతున్న మార్ఫింగ్‌ ఫొటోలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జేసీ వ్యవహారాలపై కలెక్టర్‌, ఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జేసీపై ఉన్న కేసుల్లో జేసీ ట్రావెల్స్‌ చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్క్రాప్‌ వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించారని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీకి వత్తాసు పలికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
 

Back to Top