తిరుపతి: తిరుపతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి అనుమతులు, భూ కేటాయింపుల విషయంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ స్థలాల్లో హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వ రాయితీలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. స్టార్ హోటళ్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో రెడిసన్ బ్లూ, ఎసెన్షియల్ వంటి సంస్థలకు అనుమతులు ఇచ్చారని భూమన తెలిపారు. ఈ నెల 20న మూడు హోటళ్లకు అనుమతులు ఇస్తూ జీవో జారీ చేశారని పేర్కొన్నారు. దామినేడులో సీఆర్‌ఆర్ హాస్పిటాలిటీకి భారీ రాయితీలు ఇచ్చారని తెలిపారు. దామినేడులో 21 ఎకరాలను ఎకరాకు రూ.90 లక్షలకే కేటాయించారని భూమన పేర్కొన్నారు. 1.71 సెంట్ల స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనేక రాయితీలు కల్పించారని, ఐదేళ్లపాటు విద్యుత్ ఉచితం సహా పలు రాయితీలు ఇచ్చారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన భూమిని వ్యాపార సంస్థలకు తక్కువ ధరకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. సీఆర్‌ఆర్ హాస్పిటాలిటీ సంస్థకు గతంలో స్టార్ హోటళ్ల నిర్మాణ అనుభవం ఉందా? ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని భూమన కోరారు. గూగుల్‌లో కూడా సంస్థకు సంబంధించిన వివరాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. చిన్న ఇంటి చిరునామాతో ఉన్న సంస్థకు భారీ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. స్టేట్ బోర్డు అనుమతులు ఎలా మంజూరు చేసిందో వెల్లడించాలని కోరారు. ఒకే ప్రాంతంలో వ్యాపార కేంద్రాలకు భారీ విలువైన భూమిని తక్కువ ధరకే కేటాయించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని భూమన అన్నారు. అనామక సంస్థకు ఇన్ని రాయితీలు ఎందుకు ఇచ్చారో ప్రజలకు వివరించాలని కోరారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న పెద్దలు ఎవరో బయటకు రావాలని అన్నారు. తిరుపతిలో ఇప్పటికే పర్యాటకుల సంఖ్య కారణంగా పలు ఇబ్బందులు ఉన్నాయని భూమన పేర్కొన్నారు. నగరంలో హోంస్టేలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. రూ.600 కోట్లతో నిర్మించిన వసతి గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా స్టార్ హోటళ్లకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. హోటళ్ల అనుమతుల వెనుక ఉన్న కుట్ర ఏమిటో బయటకు రావాలని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. స్టార్ హోటళ్ల అనుమతులు, భూ కేటాయింపుల వ్యవహారాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.