కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఆక్వా రంగం కుదేలు:

అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం ధ్వజం

తాడేపల్లి గూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నియోజకవర్గ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం.

ఫీడ్ కంపెనీలతో లాలూచీ పడి చంద్రబాబు, లోకేష్, పవన్ ( సీ ఎల్ పి) ట్యాక్స్' వసూళ్లు..

ఆక్వా రైతులపై విద్యుత్,  ఫీడ్ ధరల పిడుగు: మండిపడ్డ వడ్డీ రఘురాం

తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం పూర్తిగా కుదేలైందని వైయ‌స్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, అప్సడా (APSADA) మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు అద్భుతంగా ఉన్నాయంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వాస్తవాలను తొక్కిపెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అండదండలతో ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆక్వా డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్‌గా ఉండి కూడా ఫీడ్ మాఫియాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి కంపెనీలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఫీడ్ రేట్ల పెంపుతో రైతులపై పెనుభారం..

రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే ఫీడ్ రేట్లను కేజీకి రూ.14 నుంచి రూ.15 వరకు పెంచేశారు. ఫిబ్రవరి 26న కేజీకి రూ.4, మళ్లీ జూన్ 12న రూ.10 పెంచారు. టన్ను ఫీడ్‌పై ఏకంగా రూ.15,000 అదనపు భారం పడటంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పంట సాగు చేసినా నష్టాలే మిగులుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.

చంద్రబాబు మాటకు ఫీడ్ కంపెనీల వద్ద విలువేది?

గతంలో ఫీడ్ రేట్లు పెంచినప్పుడు రైతులు ఆందోళనలు చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వయంగా రూ.4 తగ్గించమని కోరితే.. కంపెనీలు కేవలం రూ.2 మాత్రమే తగ్గించాయి. అంటే సీఎం మాటకు కూడా ఆ కంపెనీల వద్ద విలువ లేకుండా పోయింది. ధరల నియంత్రణ కోసం కమిటీని వేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ కమిటీని ధరలు తగ్గించడానికి వేశారా లేక పెంచడానికా? ఆక్వా అసోసియేషన్‌ను అడ్డం పెట్టుకుని ఫీడ్ కంపెనీలు ఆడిందే ఆటగా మార్చేశారు.

సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ ధరల బాదుడు 
 గుజరాత్ కంపెనీ సర్క్యులర్..

ఆక్వా రైతుల గోడును పట్టించుకోకుండా ఫీడ్ కంపెనీలు మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి వనామీ ఫీడ్‌పై రూ.5.70, టైగర్ ఫీడ్‌పై రూ.3.85 పెంచుతున్నట్లు గుజరాత్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో లాలూచీ పడటం వల్లే వారు ఇలా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు.

రూ.వేల కోట్ల 'CLP ట్యాక్స్' ముడుపులు..

గతంలో కేజీకి రూ.2.85 పెరిగినప్పుడు నానా యాగి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వ హయాంలో రూ.14 పెంచితే ఎందుకు నోరు మెదపడం లేదు? గతంలో జే-ట్యాక్స్ అంటూ అవాకులు చవాకులు పేలినవారు.. ఇప్పుడు ఫీడ్ కంపెనీల నుంచి 'CLP ట్యాక్స్' (C - చంద్రబాబు, L - లోకేష్, P - పవన్ కళ్యాణ్) కింద ఎన్ని వేల కోట్ల ముడుపులు దండుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ముడుపులు అందుతున్నాయి కాబట్టే రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది.

వైఎస్ జగన్ హయాంలో ఆక్వాకు స్వర్ణయుగం..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆక్వా రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఫీడ్, సీడ్ నాణ్యత, ధరల నియంత్రణ కోసం చట్టబద్ధంగా 'అప్సడా'ను ఏర్పాటు చేశాం. కోవిడ్ వంటి గడ్డు కాలంలోనూ మార్కెట్ పడిపోకుండా రైతులకు అండగా నిలిచాం. రైతుల కోరిక మేరకు ఫీడ్ ధరల హెచ్చుతగ్గులు ఏడాదికి ఒకసారి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నాం.

వైయస్. జగన్ అండతో ఆక్వా రైతుల ధరలకు ఊతం..

ఆక్వా రైతుల కష్టాలను గుర్తించి, ఫీడ్ ధరల నియంత్రణతో పాటు ఆక్వా రైతులకు అండగా నిలవాలని రైతులు, ఆక్వా రైతుల సంఘాలు జగన్‌మోహన్ రెడ్డిగారిని కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు జగన్ గారు భీమవరం వచ్చి ఆక్వా రైతులకు సంఘీభావం తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వస్తున్నారని తెలిసిన సమయంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ.240 నుంచి రూ.250కి పెరిగింది. ఇవాళ అదే 100 కౌంట్ రొయ్యల ధర దాదాపు రూ.290–300 వరకు చేరింది. జగన్‌మోహన్ రెడ్డి  ఆక్వా రైతులకు చూపించిన ఆదరణ, అండ వల్లే రొయ్యల ధరలకు ఊతం వచ్చిందని ఆక్వా రైతుల్లో బలమైన అభిప్రాయం ఉంది.  వైయస్.జగన్ భీమవరం వస్తున్నారంటేనే ఆక్వా ధరలు పెరిగే పరిస్థితి ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఆక్వా అథారిటీ పెట్టాలనే ఆలోచన కూడా రాలేదు.

విద్యుత్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకు జీవో 169, 57 కుట్రలు..

ఎన్నికల్లో యూనిట్ రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు జీవో నంబర్ 169, జీవో నంబర్ 57ల పేరుతో మోసం చేస్తోంది. 0.90 నుంచి 0.95 వరకు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలనే అసాధ్యమైన నిబంధన పెట్టి సబ్సిడీని ఎత్తేసే కుట్ర చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు 0.78 పవర్ ఫ్యాక్టర్ మించి మెయింటైన్ చేయలేరు. 50 హెచ్‌పీ కెపాసిటీకి పవర్ ఫ్యాక్టర్ పరికరాలు అమర్చాలంటే హెక్టారుకు రూ.70 వేలు ఖర్చవుతుంది. రాష్ట్రంలోని 2 లక్షల హెక్టార్ల సాగుపై రూ.1,400 కోట్ల భారాన్ని మోపుతున్నారు. సెప్టెంబర్ 5న వచ్చే విద్యుత్ బిల్లులతో ప్రభుత్వ దగాకోరుతనం పూర్తిగా బయటపడుతుంది.

ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం..

ఫీడ్ ధరల పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించి... గుజరాత్‌కు చెందిన స్క్రెట్టింగ్ కంపెనీ వనామీ రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.5.70, టైగర్ రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.3.85 పెంచింది. ఈ పెంపును వెంటనే రోల్‌బ్యాక్ చేయ రఘురాం డిమాండ్ చేశారు. మరోవైపు ఆక్వా రైతుల అసోసియేషన్ పేరుతో ప్రభుత్వం కుమ్మక్కై రూ.14–15 వరకు ఫీడ్ ధరలు పెంచే ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని... లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులను ఏకం చేసి ప్రభుత్వం మెడలు వంచేలా భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Back to Top