గుంటూరు: పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై పొన్నూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయన పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి మంగళసూత్రం గత శుక్రవారం భక్తులకు కనిపించిందని, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని అంబటి మురళి తెలిపారు. ఘటన జరిగిన వారం రోజుల వరకు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేసు నమోదు చేయకపోవడం వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా సుమారు 25 మంది పూజారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారని తెలిపారు. ఒక్కో పూజారి నుంచి రూ.50 వేలు వసూలు చేసి కొత్త మంగళసూత్రం తయారు చేయించేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందన్నారు. మంగళసూత్రాన్ని మాయం చేసిన వ్యక్తిని పట్టుకోవాల్సిన పోలీసులు పూజారులను పిలిపించి పంచాయతీలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొత్త మంగళసూత్రం తయారీకి ఎక్కడ ఆర్డర్ ఇచ్చారో తమకు తెలుసని అంబటి మురళి పేర్కొన్నారు. సాయంత్రానికి కొత్త మంగళసూత్రం తయారు చేయించి, పూలతో పాటు కిందపడిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పూజారుల ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి ఒక్కో పూజారి నుంచి రూ.50 వేలు వసూలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. మంగళసూత్రం మాయమైన వ్యవహారంలో పూజారులను మాత్రమే ఎందుకు విచారిస్తున్నారని అంబటి మురళి ప్రశ్నించారు. ఆలయ సిబ్బంది, ఈవో, పాలక మండలి సభ్యులను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. పోలీస్‌స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అమ్మవారి మంగళసూత్రం మాయం వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి మంగళసూత్రాలు మాయమైన పరిస్థితిలో వ్రతం ఎలా నిర్వహించారని అంబటి మురళి ప్రశ్నించారు. ఇది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం కాదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.