కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌

 మదనపల్లె ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టును పూర్తిచేయడంలో పాలకుల నిర్లక్ష్యం

మదనపల్లె వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎస్‌. నిసార్‌ అహమద్ ఫైర్‌

అన్న‌మ‌య్య జిల్లా: మదనపల్లె ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007లో చేపట్టిన చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పనులు ఇంతకాలం గడిచినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యం కొనసాగుతోందని మండిపడ్డారు. మ‌దనపల్లె వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎస్‌. నిసార్‌ అహమద్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్యాంక్‌ నిర్మాణం, నీటి నిల్వ పరిస్థితి, మొరవ, స్పిల్‌వే, కాలువ అనుసంధానం, మదనపల్లెకు నీటి సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో నిసార్‌ అహమద్‌ మాట్లాడుతూ..మదనపల్లె ప్రజలకు శాశ్వతంగా తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి ట్యాంక్‌లో నిల్వ చేసి అవసరమైన సమయంలో మదనపల్లె ప్రజలకు తాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.

కూటమి పాలనలో ముందడుగు లేదు

సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులోని కీలక పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం. 2024 వరకు జరిగిన పనులు మినహా కూటమి ప్రభుత్వం గులకరాయంత పనికూడా చేయలేదు. సుమారు రూ.20 కోట్లు వెచ్చించినా ట్యాంక్‌ పనులను పూర్తిచేయలేకపోవడం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. 2019 నుంచి 2024 వరకు మదనపల్లె పట్టణానికి తాగునీరు, రైతులకు సాగునీరు విజయవంతంగా అందించాం. రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కరువు కరాళ నృత్యం చేస్తోంది.

 జింకా చలపతి మాట్లాడుతూ..వేసవిలో మదనపల్లె ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం బాధాకరం. భారీగా ప్రజాధనం ఖర్చు చేసినా పూర్తి స్థాయి నీటి నిల్వ, నియంత్రణ, సురక్షిత వినియోగానికి అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. హంద్రీ–నీవా జలాలను మదనపల్లె నియోజకవర్గంలోని చెరువులు నింపిన తర్వాతే కుప్పంకు తరలించాలి. మదనపల్లె ప్రజల తాగునీటి అవసరాలను ప్రభుత్వం ముందుగా తీర్చాలి.

  వి.ఎస్‌. రెడ్డి మాట్లాడుతూ.. 2007లో రూ.69.91 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ట్యాంక్‌ నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరిగింది. కాగ్‌ నివేదికలోనూ ట్యాంక్‌కు అనుసంధానమైన ప్యాకేజీ–59ఏ పనులకు సంబంధించిన కీలక ఆర్థిక, కాంట్రాక్టు అంశాలు ప్రస్తావించబడ్డాయి. టన్నెల్‌ పనులకు సంబంధించి సుమారు రూ.6.19 కోట్ల అదనపు చెల్లింపుపై కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లో మొరవ, స్పిల్‌వే పనులు ఇంతకాలం ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? వాటికి కేటాయించిన నిధులు ఎంత? కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? పనులు ఎందుకు ఆలస్యమయ్యాయి? ఆలస్యానికి బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

 శరత్‌ రెడ్డి మాట్లాడుతూ..మదనపల్లెకు తాగునీరు అందించేందుకు రూపొందించిన ఈ ప్రాజెక్టును రాజకీయ కోణంలో కాకుండా ప్రజా అవసరంగా చూడాలి. ప్రజలకు శాశ్వత తాగునీటి వసతి కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలి. రమణ మాట్లాడుతూ..మదనపల్లె ప్రజల తాగునీటి హక్కు కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుంది. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలకు శాశ్వత తాగునీటి వసతి కల్పించే వరకు పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జింకా చలపతి, వి.ఎస్‌. రెడ్డి, రమణ, శరత్‌ రెడ్డి, కొత్తపల్లి మహేశ్‌, నాగార్జున నాయుడు, యూనస్‌, బయ్యా రెడ్డి, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, అంకిశెట్టిపల్లె రమణ, యాసిన్‌, నవాజ్‌ అలీ ఖాన్‌, సాధిక్‌, ముజీబ్‌, చీకలబైలు చలపతి, చంద్ర, షేక్‌ జబి, మాలెపాడు చలపతి, చెన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top