తాడేపల్లి: గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా, గుజరాత్ కు వెళ్లి మరీ ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. సౌమ్యుడైన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీల్లో భాగంగా తాను డబ్బులిచ్చినా, సరుకు ఇవ్వకుండా పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే, తిరిగి ఆయనపై ఎదురుకేసు పెట్టడం ఏంటని పార్టీ మైనార్టీ విభాగం నేతలతో పాటు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుజరాత్ వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరమేంటి ?: అంబటి రాంబాబు, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను తప్పుడు కేసులో గుజరాత్ లో అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసి, పోలీసుల వేధింపులకు గురికాకుండా ఉండేందుకే ఆయన గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. ముస్తఫా బంధువును హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని, ఆయన ఇచ్చిన సమాచారంతో గుజరాత్ వెళ్లి అరెస్టు చేశారు. అక్కడి నుంచి తెచ్చి నూజివీడు కోర్టులో హాజరుపర్చారు. మాజీ ఎమ్మెల్యేగా ముస్తఫాను కాపాడుకునేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తాం. గుజరాత్ వెళ్లి ముస్తఫాను అరెస్టు చేసి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ? మేం ఇచ్చిన ఫిర్యాదుల్ని పోలీసులు నమోదు చేయడం లేదు. నిన్న గుంటూరులో మా పార్టీకి సంబంధం లేని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు కూడా తీసుకోలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ, తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని సైతం చాలా ఘోరంగా అరెస్టు చేశారు. తలుపులు బద్దలు కొట్టి, సీసీ కెమెరాలు పగులగొట్టి అరెస్టు చేశారు. అరెస్టు చేస్తే బెయిల్ రాకుండా ఉండే కేసులు పెట్టాలనే పోలీసులు కుట్ర చేస్తున్నారు. విరూపాక్షి కేసులో ఓ మహిళ బట్టలు చించేశాడని కేసు పెట్టారు. సీసీ ఫుటేజ్ లో ఆమె భర్తే బట్టలు చించాడని బయటపడింది. పోలీసులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల్ని టీడీపీలో ఓ వింగ్ లా వాడుకుంటున్నారు. అలా ఉపయోగపడని వారిని లూప్ లైన్ లో పడేస్తున్నారు. ప్రభుత్వ దుర్మార్గాల్ని ఎదుర్కొంటాం. భయపడం, అవసరమైతే మా నాయకులు రెండు, మూడు నెలలు జైల్లో ఉండేందుకు కూడా సిద్దమే. ప్రశ్నిస్తున్నందుకే మా కుటుంబంపై వేధింపులు: నూరీ ఫాతిమా, గుంటూరు సిటీ అధ్యక్షురాలు నేను ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు న్యాయం చేయాలని అనుకున్న వ్యక్తిని ఇవాళ కించపరిచి ఎలా వ్యక్తిత్వ హననం చేస్తున్నారో ప్రజలు గమనించాలి. ఏ1 నుంచి ఏ9 వరకూ నా తండ్రితో పాటు తమ్ముడిని కూడా పెట్టారు. ఇప్పుడు కొత్తగా మరో స్టోరీ క్రియేట్ చేసి మా కజిన్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. శనివారం రాత్రి నుంచి నా కజిన్ ను తమ అదుపులో ఉంచుకుని, ఆయన కనిపించడం లేదని అతని భార్య ఫిర్యాదు చేస్తే.. మా మీద ఫిర్యాదు చేస్తావా అంటూ ఐటీ ఉద్యోగిని అయిన ఆమెపై కూడా కేసు పెట్టారు. ఏ 1 నుంచి ఏ10 వరకూ అందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తిస్తుందని చెప్తున్నారు. దీన్ని బట్టి ముస్తఫా గారిని ఎలాగైనా జైలుకు పంపించాలని, రిమాండ్ కు పంపాలని చూస్తోంది. ముస్తఫా గారు ఎలాంటి వ్యక్తో తెలుసు, క్రిమినల్ నేపథ్యం కూడా లేకపోయినా ఇలా వేధిస్తున్నారు. మా కుటుంబం మొత్తాన్ని వేధిస్తున్నారు. మా కుటుంబంలో నేను, అక్క, అమ్మ మాత్రమే ఉన్నాం. వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్నిస్తున్నాననే కక్షతోనే ఇలాంటి వేధింపులకు దిగుతున్నారు. నేను ప్రభుత్వం మీద ఏదైనా తప్పుడు ఆరోపణ చేశారా ? మా గొంతు నొక్కడానికే ఇలాంటి కక్షసాధింపులకు దిగుతున్నారు. బెయిల్ రాకుండా చేస్తాం, జైల్లోనే ఉంచుతామని వాళ్లు ధీమాగా చెప్తున్నారు. మేం మాత్రం కోర్టుల్లో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. మీ బెదిరింపులకు మైనార్టీలు భయపడరు: ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వేధింపుల పర్వం ఎలా కొనసాగుతోందో రాష్ట్రమంతా చూస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు కూడా ఇందులో భాగమే. ఓ వ్యాపారి తనకు సరుకు ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వకుండా లారీలో పారిపోతుండగా.. డబ్బులు తీసుకుని, సరుకు ఇవ్వకుండా ఎలా వెళ్లిపోతారని పట్టుకుని ప్రశ్నించారు. దీనికి కిడ్నాప్ కేసు పెట్టారు. ఓ వ్యాపారి లావాదేవీల్లో భాగంగా సరుకు ఇవ్వని వ్యక్తిని ఆపితే కిడ్నాప్ కేసు పెడతారా ? రఘురామకృష్ణంరాజు బాధితులు ఇలాంటి ఫిర్యాదు చేస్తే కేసు పెట్టరు. కానీ వైఎస్సార్సీపీ నాయకుల మీద అయితే వెంటనే కేసులు పెడతారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు భయపెడితే భయపడతారని మీరు అనుకుంటున్నారు. మైనార్టీ నాయకులు మీ బెదిరింపులకు భయపడరు. రెడ్ బుక్ రాజ్యాంగం, మీ రాక్షస పాలన అంతమయ్యే రోజు త్వరలోనే ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక్లలో మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. పోలీసుల్ని నమ్మి వెళ్తే ఎదురుకేసు పెట్టారు: హఫీజ్ ఖాన్, మైనార్టీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు పెట్టడం దారుణం. ముస్తఫా గారు సౌమ్యుడు, మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త. రెండేళ్లుగా ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ తన కూతురిని మాత్రం ప్రోత్సహిస్తున్నారు. వివాదాలకు కూడా దూరంగా ఉండే మనిషి. ఆయన దగ్గర డబ్బులు తీసుకుని సరుకు ఇవ్వకుండా వెళ్లిపోతున్న వ్యక్తిని ముస్తఫా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆయన మీదే కేసు నమోదు చేయడం బాధాకరం. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముస్తఫా.. పోలీసుల్ని నమ్మి స్టేషన్ కు వెళ్తే తిరిగి ఆయన్నే కేసులతో వేధిస్తున్నారు. సరుకు ఇవ్వకుండా వెళ్లిపోతున్న వ్యక్తిని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చి అప్పగిస్తే కిడ్నాప్ ఎలా అవుతుందో పోలీసులే చెప్పాలి. ఓ మంచి మనిషి మీద ఇలాంటి కుట్రలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? వైఎస్సార్సీపీలో ముస్తఫా కుమార్తె చురుగ్గా ఉందనే కారణంతో ఇలా వేధింపులకు దిగుతున్నారు. రఘురామకృష్ణంరాజు వ్యక్తులు ఓ వ్యాపాతవేత్తను కిడ్నాప్ చేస్తే కేసు పెట్టలేదు. కానీ ముస్తఫా గారు నిజాయితీగా స్టేషన్ కు తెచ్చి సదరు వ్యక్తిని అప్పగిస్తే కిడ్నాప్ కేసులు పెట్టడం దిగజారుడుతనమే. రాష్ట్రంలో మైనార్టీలతో పాటు వైయస్ఆర్‌సీపీ ముస్తఫా కుటుంబానికి అండగా ఉంటుంది.