తాడేపల్లి : డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆందోళనకు దిగారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలంటూ వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో మండలి కొద్దిసేపు హోరెత్తింది. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. డీఎస్సీపై ప్రశ్నిస్తే ఏపీపీఎస్సీ, గ్రూప్–1 అంశాలను తెరపైకి తీసుకురావడం ఎందుకని ప్రశ్నించారు. “మేం డీఎస్సీ గురించి అడుగుతుంటే ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని చెబుతున్నారు. మా హయాంలో నిర్వహించిన గ్రూప్–1పై సీబీఐ విచారణ చేయించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ డీఎస్సీపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు? శాసనసభలో చెప్పిన విషయాలనే మండలిలోనూ చెప్పాలి. మేం అదే అడుగుతున్నాం” అని బొత్స పేర్కొన్నారు. కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు? డీఎస్సీ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగి ఉంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని బొత్స అన్నారు. మండలిలో చర్చకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్ మౌనమేలా? అసెంబ్లీకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పయ్యావుల కేశవ్ పక్కనే కూర్చున్నారని బొత్స ప్రస్తావించారు. మండలిలో డీఎస్సీపై సమాధానం చెప్పాల్సిన మంత్రి మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. సభలో చర్చకు అవకాశం ఇవ్వకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పే వరకు సభలో తమ పోరాటం కొనసాగుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.