అమరావతి: డీఎస్సీ–2025 అక్రమాలపై శాసన మండలిలో చర్చ జరపాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, మొండితోక అరుణ్ మాట్లాడుతూ.. డీఎస్సీపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభ నుంచి వెళ్లిపోయారని అన్నారు. డీఎస్సీపై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చామని, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని తోట త్రిమూర్తులు అన్నారు. సభలో చంద్రబాబు, లోకేష్ ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని పేర్కొన్నారు. రైతులు, మహిళలు గ్రామాల్లో అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి నేతలు ప్రజలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. మొండితోక అరుణ్ మాట్లాడుతూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన సుమారు 400 ఉద్యోగాలను రద్దు చేయాలని, డీఎస్సీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలని, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై లోకేష్‌ను ప్రశ్నించాలని మొండితోక అరుణ్ అన్నారు. బీఏసీ సమావేశంలోనూ డీఎస్సీపై చర్చకు వైయస్ఆర్‌సీపీ పట్టుబడుతుందని స్పష్టం చేశారు.