రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చేదీ? 

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సూటి ప్ర‌శ్న 

అనంతపురం: అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉరవకొండ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శ్రీశైలం నీటిని విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో తెలంగాణకు తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా మంత్రులు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హంద్రీనీవా, తుంగభద్ర ఎగువ కాలువ నీటిని కరవు ప్రాంతాలకు ఎందుకు అందించడం లేదని నిలదీశారు. ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నీటి ప్రణాళిక లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Back to Top