కర్నూలు: గోరుకల్లు, వెలుగోడు రిజర్వాయర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్‌కు నీరు విడుదల చేసిన ఘనత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డిదేనని తెలిపారు. గోరుకల్లు, వెలుగోడు రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తోనే వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తోందని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు నీరు అందిస్తే ఆరుతడి పంటలకు ఉపయోగపడుతుందని, నీరు విడుదల చేయకపోతే రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. రైతులు, ప్రజల కోసం పోరాటం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరిత రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు దక్కాల్సిన నీటి వాటాను సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.