అల్లూరి జిల్లా: మారికవలస గిరిజన ఇంగ్లీష్ మీడియం బాలుర గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి వైయస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురుకుల పాఠశాలకు వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకుని, ఎమ్మెల్యేలకు పాఠశాలలోకి వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. గత నెల రోజులుగా పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆదివాసీ, ప్రజా, విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సీఎం చంద్రబాబు అరకు పర్యటనకు ముందు అధికారులు మారికవలస గురుకులాన్ని యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చినా, పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించే ప్రతిపాదన తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, విద్యార్థులందరినీ తిరిగి మారికవలసకే తీసుకెళ్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మతో పాటు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు తెలిపారు. ఆ హామీ మేరకు విద్యార్థులను బస్సుల్లో మారికవలసకు తరలించిన అనంతరం మళ్లీ మాట మార్చడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని డా. కుంభా రవిబాబు కోరారు. విద్యార్థుల విద్యా భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే ఆదివాసీ, విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.