కృష్ణా జ‌లాల విడుదల కోసం వైయ‌స్ఆర్‌సీపీ సమరశంఖం

సాగు, తాగునీటి కోసం సెప్టెంబ‌ర్ 1న వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ ముట్టడికి పిలుపు

కర్నూలు: వెలుగోడు ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ రైతుల పక్షాన సమరశంఖం పూరించింది. వెలుగోడు రిజర్వాయర్‌ను ముట్టడించేందుకు పార్టీ నాయకులు, రైతులకు పిలుపునిచ్చారు. రాయలసీమ రైతుల సాగు, తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని వినియోగించుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తోందని అన్నారు.

సాగు, తాగునీటి కోసం రైతుల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. వెలుగోడు ప్రాజెక్టు ముట్టడికి సిద్ధమవుతున్న రైతులను కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల నీటి హక్కుల కోసం పార్టీ జెండాలు, అజెండాలను పక్కనపెట్టి అందరూ కలిసి పోరాటానికి రావాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 

Back to Top