తాడేపల్లి: వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 1996 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోలేదని, వైయస్సార్ జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుకు ప్రాధాన్యత కల్పించి ప్రధాన పనులను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. వెలిగొండలోని ప్రధాన టన్నెళ్లను వైయస్సార్, వైయస్ జగన్ హయాంలోనే పూర్తి చేశారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎవరి హయాంలో ఎంత పని జరిగిందో లెక్కలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. కేవలం శిలాఫలకం వేసి ప్రారంభించడం మినహా ప్రాజెక్టులో ప్రధాన పనులు వైఎస్సార్, వైయస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు. పబ్లిసిటీ చేసుకోవడంలో చంద్రబాబును మించినవారు లేరని ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టులో వైయస్సార్, వైయస్ జగన్ కంటే చంద్రబాబు ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేసినా, తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ చేశారు. వైయస్సార్, వైయస్ జగన్ కంటే ఎక్కువ పనులు చేసినట్లు నిరూపించి క్రెడిట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వెలిగొండలో కనీసం ఆరు కిలోమీటర్ల టన్నెల్ పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని ఆయన పేర్కొన్నారు.