గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలి

అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థలను వినియోగించి వారిని సురక్షితంగా తీసుకురావాలి

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి:  డాక్ట‌ర్ బీ.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల నుంచి చాలా రోజులుగా ఎలాంటి సమాచారం అందకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని వైయస్‌ జగన్‌ కోరారు.

కోస్ట్‌గార్డ్‌, నేవీ, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగంతో పాటు సముద్రంలో అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక, సమాచార వ్యవస్థలను వినియోగించి గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని ఆయన సూచించారు. కాకినాడ, విశాఖపట్నం, పారాదీప్‌తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల బోట్లు, ఇతర నౌకల సహకారాన్ని కూడా తీసుకుని గల్లంతైన బోటు ఆచూకీ కోసం నిరంతరంగా ప్రయత్నించాలని కోరారు. ఎనిమిది మంది మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, వారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Back to Top