అసెంబ్లీకి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ర్యాలీ..  

అమరావతి : డీఎస్సీ–2025 అక్రమాలపై శాసన మండలిలో చర్చ చేపట్టాలని పట్టుబడుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మంగళవారం అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తూ వస్తున్న ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని నిలువరించడంతో ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. “సీబీఐతో డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి.. మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి” అంటూ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. డీఎస్సీ అంశంపై మండలిలో చర్చ జరపాల్సిందేనని స్పష్టం చేశారు.

 కౌన్సిల్‌ నుంచి ఎందుకు పారిపోతున్నారు?

మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అసెంబ్లీలో డీఎస్సీపై చర్చిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం శాసన మండలిలో మాత్రం ఎందుకు చర్చకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ అంశంపై మండలిలో సమాధానం చెప్పాలని, చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. కాగా, రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎస్సీ అక్రమాలపై చర్చ చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సమగ్రంగా చర్చించి, సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.

Back to Top