తాడేపల్లి: చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతంలో కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో భారీ ఎత్తున ఇసుక దోపిడీ సాగుతోందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా సాగించి సహజ సంపదను ఇష్టారాజ్యంగా దోచుకున్నారని వైెయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అంతేగాక నదీ గర్భానికి 20 నుంచి 30 అడుగుల మేర లోతు తవ్వకాలు జరిపి సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోజుకు 150 నుంచి 200 లారీల ద్వారా భారీ స్థాయిలో ఇసుక తరలిస్తున్నారని ఆధారాలతో సహా వివరించారు. పర్యావరణ అనుమతులు, మైనింగ్ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు లేకుండానే నది గర్భాన్ని 20 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 30 టన్నులు మోయాల్సిన లారీల్లో 60 నుంచి 70 టన్నుల వరకు ఇసుకను లోడ్ చేసి రోడ్లను ధ్వంసం చేస్తున్నారని, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని అగ్రహం వ్యక్తం చేసారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే అనుమతి ఉన్నా, దానిని పూర్తిగా ఉల్లంఘించి భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయని కళ్ల ముందు కనిపిస్తున్నా సరే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడరంటే... . ఎన్జీటీలో ఫిర్యాదు చేస్తాం ఇటీవల రాజంపేట ఎమ్మెల్యేతో కలిసి చెయ్యేరు నది ప్రాంతాన్ని పరిశీలించాం. అక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరినా, మేము వెళ్లిన సమయంలో యంత్రాలను దాచిపెట్టి, తిరిగి వెళ్లిన వెంటనే మళ్లీ అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. నదీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అడ్డగోలు తవ్వాకాల కారణంగా రైతుల బోర్లు ధ్వంసం అవుతున్నాయి. పంటలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. పశువులు కూడా నదిని దాటలేని దుస్థితి దాపురించింది. చెయ్యేరు నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తాం. జరుగుతున్న అక్రమ తవ్వకాలు, ప్రకృతి సహజ సంపద దోపిడీ, భారీ యంత్రాలతో తవ్వాకాలు చేసి పరిమితికి మించి ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తాం. దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని తీసుకెళ్ళి చర్చ జరిగేలా చేస్తాం. ప్రభుత్వం వెంటనే చెయ్యేరులో అక్రమ తవ్వకాలను నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకు..? పర్యావరణ పరిరక్షణ గురించి తరచూ మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెయ్యేరు నదిలో సాగుతున్న భారీ సహజ వనరుల దోపిడీపై ఎందుకు స్పందించడం లేదు. ఏదైనా జరిగితే పవన్ కల్యాణ్ ఊగిపోతూ ప్రశ్నిస్తుంటారు కదా. నదీ పరివాహక ప్రాంతంలో కోటి మిలియన్ టన్నుల ఇసుక అక్రమ రవాణాపై స్పందించకుండా మౌనం ఎందుకు వహిస్తున్నారు. పర్యావరణ శాఖను పవన్ కల్యాణ్ నే కదా పర్యవేక్షణ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తోపాటు పర్యావరణవేత్తలు, సంబంధిత శాఖలు కూడా ఎందుకు మౌనంగా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. దిగజారిన ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయింది. జీఎస్టీ వృద్ధి, రెవెన్యూ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కంటే చాలా వెనుకబడి ఉంది. వైెయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పును కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసింది. అయినప్పటికీ అభివృద్ధి కనిపించడం లేదు. , ఆదాయ వృద్ధి కూడా లేదు. విజనరీని అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో గ్రోత్ రేటు దారుణంగా దిగజారిపోయింది. గత రెండేళ్లు కలిపి 4 శాతం కూడా వృద్ధి రేటు లేదు. జీఎస్టీలో మిగిలిన రాష్ట్రాలన్నీ రెండంకెలను దాటిపోగా, మన రాష్ట్రం అత్యంత వెనుకబడిపోయింది. రెవిన్యూ ట్యాక్స్ జనరేషన్ లో నేషనల్ యావరేజ్ 95 శాతం ఉంటే, మన రాష్ట్రంలో కేవలం 4 శాతం మాత్రమే నమోదైంది. 2025-26 సంవత్సరానికి నేషనల్ యావరేజ్ 4 శాతం ఉంటే, మన రాష్ట్రంలో ఏకంగా మైనస్ 32 శాతానికి దిగజారింది. ఈ గణంకాలు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుుతన్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ మానుకుంటే మంచిది ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు వైెయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం మానుకోవాలి. రైతులు, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణ, శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రజల ఆస్తులను కాపాడడం, రాష్ట్ర ప్రయోజనాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. చెయ్యేరు అక్రమ ఇసుక తవ్వకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. లేదంటే వైెయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తుంది.