ఓట్ల తొలగింపు జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలి

మాజీ మంత్రి పేర్ని నాని విజ్ఞ‌ప్తి

స‌చివాలయంలో సర్‌పై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో క‌లిసి పాల్గొన్న పేర్ని నాని, 
అనంత‌రం వైఎస్సార్‌సీపీ తరఫున ప్రస్తావించిన అంశాలను మీడియాకు వివరించారు. 

మ్యాపింగ్, డ్రాఫ్ట్‌ ప్రక్రియ పూర్తైనా జాబితాలో లోపాలు 

తొందరపడి ఎవరి ఓట్లూ తొలగించవద్దు

ఒక కుటుంబం ఓట్లు ఒకే పోలింగ్‌ బూత్‌లో ఉండాలి

వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల సంఘానికి పేర్ని నాని సూచ‌న‌లు

సెక్ర‌టేరియ‌ట్: రాష్ట్రంలో ‘సర్‌’ ప్రక్రియ తర్వాత ఓట్లు తొలగించేందుకు సిద్ధం చేసిన జాబితాతోపాటు అన్‌మ్యాప్డ్, నాట్‌ ట్రేస్డ్‌ ఓటర్ల జాబితాలను పోలింగ్‌ బూత్‌ల వారీగా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు పేర్ని నాని ఎన్నికల సంఘాన్ని కోరారు. తొందరపడి అర్హుల ఓట్లు తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌)పై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో క‌లిసి పాల్గొన్న పేర్ని నాని, వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ప్రస్తావించిన అంశాలను మీడియాకు వివరించారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

ఒకే బూత్‌లో ఓట్లు ఉండేలా చూడండి
భర్త ఓటు ఒక పోలింగ్‌ బూత్‌లో ఉంటే.. భార్య ఓటు వేరే చోట ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భార్యాభర్తల ఓట్లు ఒక బూత్‌లో పిల్లల ఓట్లు వేరే బూత్‌లో ఉన్నాయి. ఒకే వీధిలో ఉన్నవారి ఓట్లు కూడా వేర్వేరు బూత్‌లలో ఉన్నాయి. అలాంటి లోపాలు సరిదిద్దాలి. కుటుంబ సభ్యులతో పాటూ ఒకే వీధిలో ఉన్నవారి ఓట్లు ఒకే పోలింగ్‌ బూత్‌లో వచ్చేటట్టు చూడాలి. డూప్లికేట్‌ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఓట్లను గుర్తించి తొలగిస్తున్నామని ఎన్నికల అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి తేడా ఉంది. ‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఒకే వ్యక్తికి చిలకలూరిపేట, నరసరావుపేటలో రెండుచోట్లా ఓటుహక్కు ఉంది. ఆధారాలతో సహా ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులకు జాబితా అందించాం. మ్యాపింగ్, డ్రాఫ్ట్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అనేక లోపాలు ఉన్నాయి. అధికారులు ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసి ముందుకు వెళ్లాలి. 

ఉద్యోగులపై ఒత్తిడితో తప్పులకు అవకాశం
బీఎల్‌వోలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఇతర అధికారులకు కూడా రోజువారీ విధులు అప్పగిస్తున్నారు. దీంతో వారు ఒత్తిడికి గురై ఓటరు జాబితాలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారికి ఇతర పనులు చేయాలనే ఒత్తిడి తగ్గించి.. ప్రక్రియ సజావుగా చేపట్టాలి. మ్యాపింగ్‌లో కొత్త ఫొటోలు ఇచ్చిన వారిని చేర్చాలి. ఎన్నికల అధికారికి ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అంశం గురించి వివరించినా.. అంతా ఢిల్లీ పరిధిలోనే అంటున్నారు. అలాకాకుండా రాజకీయ పార్టీలు లేవనెత్తిన వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకుని తప్పులు లేని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటరు జాబితా రూపకల్పన చేయాలని పేర్ని నాని కోరారు.

Back to Top