వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై చేసిన ప్రజంటేషన్‌ను తీవ్రంగా విమర్శించారు. మూడు గంటల పాటు ప్రజంటేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రజలను మరోసారి అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. చంద్రబాబు దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిపామని, కోటిన్నర మందికి సంక్షేమ పథకాలు అందించామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. గత రెండు సంవత్సరాల్లో రూ.3.65 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబేనని పేర్కొన్నారు. హామీలు కొండంత... అమలు గోరంత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కొండంతగా ఉన్నా, అమలు మాత్రం గోరంత కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఎగవేతలు, కోతలు విధిస్తూ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, వాస్తవాలను దాచిపెట్టి ప్రచారంతో పాలన సాగిస్తున్నారని అన్నారు. 22 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? రెండు సంవత్సరాల్లో 22 లక్షల ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ప్రజల ముందు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలి ఏడాదిలోనే రూ.1.31 లక్షల కోట్ల సంక్షేమాన్ని అమలు చేసి, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని రాచమల్లు గుర్తు చేశారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తూ పారదర్శకంగా పాలన సాగించారని అన్నారు. సూపర్ సిక్స్‌కు పంగనామాలు ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ సిక్స్ హామీలకే చంద్రబాబు ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని విమర్శించారు. సూపర్ సిక్స్ మాత్రమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీల్లో ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోటిన్నర మందికి సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబు, అవి ఎక్కడ, ఎవరికి అమలు చేశారో ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. ప్రజలను అబద్ధాలతో ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ప్రజలకు వాస్తవాలు పూర్తిగా అర్థమయ్యాయని, అబద్ధాల పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా అబద్ధాల ప్రచారం మానేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.