విశాఖపట్నం: విశాఖపట్నం సముద్రంలో పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి విశాఖలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు చిన్నను పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో చిన్నతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, బాధిత కుటుంబాలకు అందించిన పరిహారం సరిపోదని పేర్కొంటూ, మత్స్యకారుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. - ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకున్న వైయస్ జగన్ ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ప్రమాదం జరిగిన రాత్రి పరిస్థితులు, పడవ బోల్తా పడిన తర్వాత జరిగిన పరిణామాలు, తాను ఎలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు, చివరకు ఎవరు రక్షించారు అనే అంశాలను చిన్న వైయస్ జగన్‌కు వివరించారు. పడవ కొనుగోలుకు భారీగా అప్పులు చేసి ఇప్పుడు జీవనోపాధి కోల్పోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని చిన్న కోరగా, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందేలా ఒత్తిడి తీసుకొస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైతే స్వయంగా విశాఖకు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు. అనంతరం వైయస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే.. - వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని ముందుగానే వాతావరణ హెచ్చరికలు జారీ అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదు. మత్స్యకారుల భద్రత కోసం వార్‌రూమ్ ఏర్పాటు చేసి సముద్రంలో ఉన్న పడవలను ట్రాక్ చేయడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రక్షణ చర్యలు చేపట్టే వ్యవస్థను ప్రభుత్వం అమలు చేయలేదు. మత్స్యకారుల ప్రాణాలకు సమాన విలువ ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన పరిహారం, జీవనోపాధి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. - బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: మజ్జి శ్రీనివాసరావు ప్రమాద సమాచారం కోస్ట్ గార్డ్, సంబంధిత అధికారులకు ముందుగానే అందినప్పటికీ తక్షణ రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. వేగంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఉంటే మరింత మందిని కాపాడే అవకాశం ఉండేది. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నను పూర్తిగా విస్మరించింది. కనీసం అధికారులు పరామర్శించకపోవడం బాధాకరం. బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. - వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గత కొన్ని రోజులుగా గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించలేదు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం అందించడంలోనూ, బాధితులను పరామర్శించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. వైయస్ జగన్ వ్యక్తిగతంగా చిన్నతో మాట్లాడి ధైర్యం చెప్పడం, అవసరమైతే స్వయంగా విశాఖకు వస్తానని హామీ ఇవ్వడం ఆయన బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనం. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి. ప్రాణాలతో బయటపడిన చిన్నకు ప్రత్యేక ఆర్థిక సహాయం, మునిగిపోయిన పడవకు పూర్తి నష్టపరిహారం అందించాలి. మత్స్యకారుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని కేకే రాజు స్పష్టం చేశారు.