విశాఖపట్నం: చేపల వేటకు వెళ్లి, సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ప్రాణాలతో బయట పడిన మత్స్యకారుడు చిన్నను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నకు ఫోన్ చేసిన శ్రీ వైయస్ జగన్, జరిగిన దుర్ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఆ రాత్రి సముద్రంలో ఏం జరిగింది? ప్రమాదం తర్వాత తామెలా బయట పడేందుకు ప్రయత్నించారు? తానొక్కడే అంత దూరం ఎలా ఈదగలిగాడు? చివరకు తనను ఎవరు రక్షించారు? అన్న పూర్తి వివరాలు మత్స్యకారుడు చిన్న, శ్రీ వైయస్ జగన్‌కు వివరించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా, పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో ఆరుగురు గల్లంతు కాగా, చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు. నిజానికి సముద్రంలో పడవ ప్రమాదంపై అటు కోస్ట్ గార్డుకు, ఇటు ప్రభుత్వ అధికారులకు వేగంగానే సమాచారం అందినా, స్పందించడంలో వారు తీవ్ర అలక్ష్యం చూపారు. ఆ మత్స్యకారులను రక్షించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మొత్తం అప్పు చేసి పడవ సమకూర్చుకున్నామని, ఇప్పుడు అంతా నష్టపోయామని అందుకనే తమను ఆదుకోవాలని చిన్న శ్రీ వైయస్ జగన్‌ను వేడుకున్నారు. ధైర్యం చెప్పిన ఆయన, అవసరమైతే తాను కూడా స్వయంగా విశాఖకు వస్తానని చెప్పారు. ప్రభుత్వం బోటుకు పరిహారం ఇవ్వకపోవడాన్ని శ్రీ వైయస్ జగన్ తప్పుబట్టారు. బోటు కోల్పోతే మత్స్యకారులకు ఉపాధి కూడా లేకుండా పోతుందని ఆయన గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కాగా, మత్స్యకారులు మరణించారని ప్రకటించిన ప్రభుత్వం, ఆ ఆరుగుకు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించింది. కానీ, ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నను మాత్రం పట్టించుకోలేదు. కనీసం ఏ అధికారి కూడా వచ్చి పలకరించలేదు. తనను ఏ విధంగా కూడా ఆదుకోకపోగా, దాదాపు రూ.50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని, అందుకని ఎలాగైనా ఆదుకోవాలని చిన్న శ్రీ వైయస్ జగన్‌ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన శ్రీ వైయస్ జగన్, ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అవసరం అయితే తాను కూడా స్వయంగా విశాఖకు వస్తానని శ్రీ వైయస్ జగన్, మత్స్యకారుడు చిన్నకు ధైర్యం చెప్పారు.