తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజనులపై దాడులు, మహిళలపై దౌర్జన్యాలు, రాజకీయ కక్షసాధింపు చర్యలు, ఉద్యోగాల తొలగింపులు పెరిగిపోయాయని వైయస్ఆర్‌సీపీ ఎస్టీ సెల్ (మైదాన ప్రాంతం) అధ్యక్షుడు గుండా సురేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల భద్రత, గౌరవం, ఉపాధిని కాపాడాల్సిన ప్రభుత్వం నిందితులను వెనుకేసుకొస్తూ బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల కావలి, అల్లూరు, పాడేరు, సాలూరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, గిరిజన మహిళలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల భద్రత, గౌరవం, ఉపాధిని కాపాడాల్సిన ప్రభుత్వం నిందితులను వెనుకేసుకొస్తూ బాధితులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రెస్‌మీట్‌లో సురేంద్ర ఇంకా ఏమన్నారంటే .. - గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు పరిపాటిగా మారాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, పోలీసులతో బెదిరించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గిరిజన మహిళకు నెల్లూరు మేయర్ పదవి ఇచ్చి వారి రాజకీయ సాధికారతకు పెద్దపీట వేశారు. కానీ అదే జిల్లాలో ఈరోజు గిరిజన మహిళను నడిబజారులో వివస్త్రం చేసినా ఈ ప్రభుత్వ పెద్దలకు చలనం లేకపోవడం బాధాకరం. కావలి నియోజకవర్గంలోని కచేరిమెట్ట వీధి ఘటనలో బాధిత మహిళకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ప్రధాన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకుండా సాధారణ కేసు నమోదు చేసి వదిలేయడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనం. - వైయస్సార్‌సీపీకి మద్దతిచ్చిందనే కారణంతో గిరిజన మహిళ ఉద్యోగం తొలగింపు కావలి నియోజకవర్గం అల్లూరు నగర పంచాయతీలో 2016 నుంచి కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక గిరిజన మహిళను, ఆమె భర్త వైయస్సార్‌సీపీకి మద్దతిచ్చాడనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఉన్నత విద్యావంతురాలైన ఆ మహిళను రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకోవడం అమానుషం. అంతటితో ఆగకుండా ఉద్యోగం తిరిగి కావాలంటే భర్తకు విడాకులు ఇవ్వాలని చెప్పడం మరింత దారుణం. ఒక మహిళ గౌరవం, కుటుంబ జీవితంతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? నిధులు లేవని ఉద్యోగం తొలగిస్తూనే, మరోవైపు కోట్లాది రూపాయలు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేయడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. - గిరిజన సంక్షేమ శాఖపై మంత్రికే అవగాహన లేదు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. పాడేరు ఐటిడీఏలో అనర్హుడిని ఏపీఓగా నియమించి, తర్వాత అధికారులు తప్పు సరిదిద్దాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. తన శాఖలో జరుగుతున్న లోపాలను సరిచేయకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదు. సాలూరులో పీవీటీజీ వర్గానికి చెందిన మహిళా ప్రిన్సిపాల్‌పై రాజకీయ కక్షతో చర్యలు తీసుకుని, ఆమెను విధులకు దూరంగా ఉంచడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాకుండా గృహనిర్బంధం చేయడం అత్యంత దుర్మార్గం. గిరిజనుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని గుండా సురేంద్ర హెచ్చరించారు.