తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పొగాకు రైతులు గతంలో ఎన్నడూ లేనంతటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం) ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్ల తన రైతు సంఘాల అనుభవంలో ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రి అధికారిక సమీక్షల్లో రూ.200 లోపు కొనకూడదని ప్రకటనలు చేసినా, క్షేత్రస్థాయిలో నో-బిడ్లు (కొనుగోలు నిరాకరణ) దక్షిణాది వేలం కేంద్రాలలో 6 శాతం పెరిగి 37 శతానికి చేరడం వ్యాపారుల నిరంకుశత్వానికి, ప్రభుత్వం పట్టించు కోక పొవడానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం హామీలు, హెచ్చరికలకే పరిమితం కాకుండా వైయస్.జగన్ తరహాలోనే తక్షణమే 'మార్క్ ఫెడ్' ను రంగంలోకి దించి రూ. 500 కోట్లతో పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - ముఖ్యమంత్రి హెచ్చరికలు కంటితుడుపు చర్యలేనా?.. పొగాకు మార్కెట్ సంక్షోభంపై మే 25వ తేదీనే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించాం. ఆ తర్వాత జూన్ 18న మరియు మళ్లీ జూలై 8న సీఎం చంద్రబాబునాయుడు మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, కొనుగోలు కంపెనీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కిలో రూ. 200 ల లోపు కొనడానికి వీల్లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే వచ్చే ఏడాది 'క్రాప్ హాలిడే' ప్రకటిస్తామని సీఎం హెచ్చరించినట్లు పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ, ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మరుసటి రోజు నుండే వేలం కేంద్రాల్లో ధరలు మరింతగా పడిపోవడం, నో-బిడ్లు పెరగడం చూస్తుంటే ఈ వ్యాపారుల తీరుపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని స్పష్టమవుతోంది. ఇది కేవలం రైతుల కన్నీళ్లు తుడిచే కంటితుడుపు చర్యేనా?. - మార్కెట్లో దారుణంగా పడిపోతున్న ధరలు – గణాంకాలే సాక్ష్యం.. మార్కెట్లో ప్రతి మూడు, నాలుగు రోజులకు సరాసరి అమ్మకం ధర దారుణంగా పడిపోయింది. మే 25, 2026 న సరాసరి ధర రూ. 237.21, జూన్ 9, 2026: సరాసరి ధర రూ. 232.00, జూలై 8 న 218.72 రూ.. జూన్ 18, 2026 (మొదటి సీఎం మీటింగ్): సరాసరి ధర రూ. 204.05 (దక్షిణాది తేలిక నేలల్లో) ఉంటే, జూలై 8, 2026 (రెండో సీఎం మీటింగ్ రోజు నాటికి): సరాసరి ధర రూ. 194.76 (తేలిక నేలల్లో), రాష్ట్ర సరాసరి రూ. 218.72 కి పడిపోయింది. అలాగే దక్షిణాది నల్ల నేలల్లోజూలై 8 నాటికి సరాసరి ధర రూ. 189.62 కి పడిపోయింది. ఒంగోలు-1 కొనుగోలు కేంద్రంలో రూ. 178.13, ఒంగోలు-2 లో రూ. 185.60 గా ఉంది. మొత్తం దక్షినాది లో 11 వేలం కేంద్రాలు ఉంటే 10 కేంద్రాల్లో సరాసరి ధర రూ. 200 కంటే తక్కువగానే నమోదవడం సిగ్గుచేటు. రైతులు కిలోకి రూ. 220 పెట్టుబడి పెడితే, మార్కెట్లో రూ. 160 నుండి రూ. 170 కే కొనుగోళ్లు మాత్రమే సాగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. - పెరిగిన నో-బిడ్లు.. రైతులపై అదనపు భారాలు.. ముఖ్యమంత్రి రెండోసారి మీటింగ్ పెట్టిన బుధవారం (జూలై 8) నాటికి మార్కెట్లో నో-బిడ్ల శాతం 31.06% ఉండగా, ఆ మరుసటి రోజైన జూలై 9 నాటికి అది ఏకంగా 37% కి పెరిగి వ్యాపారుల సిండికేట్‌ను నిరూపించింది. దక్షిణాది కేంద్రాల్లో సగటున 37.72% నో-బిడ్లు కాగా, టంగుటూరులో గరిష్టంగా 54.64%, వెల్లంపల్లిలో 53.98%, కనిగిరిలో 53.11%, ఒంగోలు-2 లో 50.40% బేళ్లు కొనుగోలు కాకుండా తిరస్కరణకు గురయ్యాయి. ఒక బేలు అమ్ముడుపోకుండా వెనక్కి తీసుకెళ్లాలంటే రైతుకు రూ. 1000 అదనపు భారం పడుతుంది, కూలీలకూ డబ్బులు ఇవ్వలేని స్థితిలో రైతులు ఉన్నారు. - కూటమి పాలనలో పొగాకు రైతులకు రూ. 3,284 కోట్ల నష్టం.. దిగుబడి పెరగడం వల్లే ఈ సంక్షోభం అనడం అసంబద్ధం. గత ఏడాది బోర్డు ద్వారా 240.64 మిలియన్ కేజీల పొగాకు అమ్మకం జరిగితే, ఈ ఏడాది బోర్డు లెక్కల ప్రకారం ఉత్పత్తి అంచనా కేవలం 232 మిలియన్ కేజీలే, అంటే ఉత్పత్తి తగ్గినా ధరలు తగ్గించడం వ్యాపారుల దోపిడీకి నిదర్శనం. 2023-24లో సగటు ధర కిలో రూ. 288.65 ఉండగా, 2024-25లో రూ. 248.86 కి పడిపోయింది. కిలోకు 10 రూ ఉత్పత్తి ఖర్చు పెరిగింది దీనివల్ల గత ఏడాది రైతులు రూ. 1,198 కోట్లు నష్టపోయారు. ఈ ఏడాది జూలై 8 నాటికి సగటు ధర రూ. 218.72 కి పడిపోవడం, ఉత్పత్తి వ్యయం కిలోకి రూ.20 పెరగడంతో కిలోకు రూ. 89.03 చొప్పున ఈ ఏడాది రూ. 2,086 కోట్లు నష్టపోతున్నారు. మొత్తంగా ఈ రెండు సంవత్సరాల కూటమి పాలనలో పొగాకు రైతులు రూ. 3,284 కోట్లు కోల్పోయారు. గత ఏడాది 84 వేలం రోజుల్లో 73.50 మిలియన్ కేజీల అమ్మకం జరిగితే, ఈ ఏడాది అదే 84 రోజుల్లో కేవలం 30.82 మిలియన్ కేజీలే అమ్మకం జరిగింది, అక్టోబర్ లోపు మిగిలిన 200 మిలియన్ కేజీల పంట ఎలా అమ్ముడవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. - పరిష్కారం ఒక్కటే: 'మార్క్ ఫెడ్' ను రంగంలోకి దించాలి.. గతంలో వైయస్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు మార్కెట్లో ఇలాంటి పరిస్థితి వస్తే, చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి కనీస కట్-ఆఫ్ ధరతో పొగాకును కొనుగోలు చేయించారు. వైయస్.జగన్ హాయంలో వివిధ పంటల కొనుగోళ్ల కోసం రూ. 7,800 కోట్లతో మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అండగా నిలిచారు. ఈ నేపధ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కనీసం రూ. 500 కోట్లు కేటాయించి మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్లో ప్రవేశించాలి. సీఎం ప్రకటించినట్లు రూ. 200 కంటే తక్కువ ధర ఉన్న పొగాకును ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం ప్రారంభించాలి. మార్కెట్లో ప్రభుత్వ పోటీ ఉంటేనే కంపెనీలు దిగివచ్చి సరైన ధర ఇస్తాయి. అలాగే టొబాకో బోర్డు దగ్గర ఉన్న రైతుల సొమ్మును కూడా ఇందుకోసం వినియోగించాలి. - భూ సర్వే, డిజిటల్ పాస్ బుక్స్ వైయస్.జగన్ చొరవే - కవరు మార్చి మీ ఖాతాలో వేసుకోవద్దు.. 2017లో చంద్రబాబు గారు తెచ్చిన 'వెబ్ ల్యాండ్' విధానం వల్ల ఎన్నో తప్పులు దొర్లాయి, రైతుల డిజిటల్ పాస్ బుక్ లో పేర్లు ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డుల్లో పేర్లు మార్చేసే అక్రమాలు జరిగాయి. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా వైయస్. జగన్అత్యాధునిక సాటిలైట్ లింక్డ్ రోవర్ టెక్నాలజీతో కూడిన శాశ్వత భూ సర్వే విధానాన్ని తీసుకొచ్చారు. అంగుళం కూడా తేడా లేకుండా సాటిలైట్ తో పాయింట్ ఫిక్స్ చేసి, ఆ సర్వే వివరాలు మరియు కొలతల మ్యాప్‌లతో సహా చెన్నైలో అత్యంత పటిష్టమైన డిజిటల్ పాస్ పుస్తకాలను ముద్రించి వైయస్ఆర్‌సీపీ హయాంలోనే పంపిణీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం ఆ పాస్ పుస్తకాల పైకవరు మార్చి తామేదో కొత్తగా తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. ప్రభుత్వాలు మారినా ఇది 'గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' చేసిన నిరంతర ప్రక్రియేనని అంగీకరించాలి. వైయస్.జగన్ ప్రారంభించిన ఈ అద్భుతమైన సర్వే విధానాన్ని వేగవంతం చేసి, రైతుల ఆస్తి హక్కును కచ్చితత్వంతో భద్రపరచాలి. మరోవైపు రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వైయస్ఆర్‌సీపీ నేతలపై క్రిమినల్ కేసులు పెడతామని కూటమి ప్రభుత్వం బెదిరింపులు మానుకోవాలని, తక్షణమే పొగాకు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.