తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ కక్షసాధింపు రాజకీయాలకు బలవుతున్న ప్రతి బాధితుడి పక్షాన జెన్-జే (జనరేషన్ జగన్) రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడటం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన రాజకీయ స్ఫూర్తి అని, అదే సిద్ధాంతాన్ని వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రెడ్‌బుక్ కక్షసాధింపుకు బలైన సాయికృష్ణ, క్రాంతికుమార్ వంటి బాధితులకు జెన్-జే అండగా నిలిచిందని, బాధితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా అన్యాయం జరిగితే వారికి మద్దతుగా నిలబడటమే తమ ధ్యేయమని తేల్చిచెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజాస్వామ్య పరిరక్షణ, బాధితులకు న్యాయం, రాజకీయ కక్షసాధింపుకు వ్యతిరేక పోరాటమే జెన్-జే లక్ష్యమని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో వంగవీటి నరేంద్ర ఏమన్నారంటే.. - యువతకు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి లోకేష్? పాదయాత్రలో ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం చెల్లించిన మొత్తం అందులో స్వల్ప భాగమే. మిగిలిన బకాయిలను ఎవరు చెల్లిస్తారు? ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు కళాశాలల్లో సర్టిఫికెట్లు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగ భృతి హామీని కూడా పూర్తిగా గాలికొదిలేశారు. యువతకు ఇచ్చిన ఈ హామీలపై లోకేష్ సమాధానం చెప్పాలి. - డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా? డీఎస్సీ–2025 నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో తీవ్ర అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం జీవోలను మార్చిన పరిస్థితి కనిపిస్తోంది. పారదర్శకతపై నిజంగా నమ్మకం ఉంటే డీఎస్సీ నియామకాలపై వెంటనే సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించాలి. అప్పుడు ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు యువతను మోసం చేశారో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. - బాధితుల పక్షాన జెన్-జే నిరంతర పోరాటం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి జెన్-జీ ఉద్యమం గట్టి సమాధానం చెప్పబోతోంది. మిస్టర్ లోకేష్... జెన్-జీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. బాధితుల పక్షాన పోరాడటం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన రాజకీయ స్ఫూర్తి. అదే స్ఫూర్తితో జెన్-జే (జనరేషన్ జగన్) పనిచేస్తోంది. అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే మా లక్ష్యం. రెడ్‌బుక్ కక్షసాధింపుకు బలైన సాయికృష్ణ, క్రాంతికుమార్ వంటి బాధితుల తరఫున జెన్-జే పోరాడింది. బాధితులు వైయస్సార్‌సీపీ వారైనా, జనసేన లేదా టీడీపీ కార్యకర్తలైనా... ఎవరికైనా అన్యాయం జరిగితే వారి పక్షాన నిలబడుతుంది. రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం జరగాలన్నదే జెన్-జే విధానం. వైయస్ జగన్ చూపిన ప్రజాపక్ష మార్గంలోనే ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజకీయ కక్షసాధింపుకు వ్యతిరేకంగా జెన్-జే తన రాజీలేని పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుంది.