భోగయ్య కేసులో ఒక న్యాయం.. మా కుటుంబానికి మరో న్యాయమా?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి

శ్రీకాకుళంలోని 7 బిర్యానీస్ హోటల్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి

 2024 డిసెంబర్ 21న కొరసవాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో చెప్పుల భోగయ్య మృతి

 టీడీపీ ఎమ్మెల్యే కుమారుడే వాహనం నడిపారని బాధిత కుటుంబం చెబుతున్నా కేసు డ్రైవర్‌పైకి ఎలా మళ్లింది?

 చెప్పుల భోగయ్య కుటుంబానికి ఇస్తామన్న రూ.5 లక్షల సాయం, పెన్షన్ హామీలు ఏమయ్యాయి?

 భోగయ్య కేసును రీ-ఓపెన్ చేసి స్వతంత్ర విచారణ జరపాలి

 బాధిత కుటుంబం చెబుతున్న అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరపాలి

 రాష్ట్రంలో ఒకే చట్టం.. ఒకే న్యాయం ఉండాలి

 ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తారా?

 18 ఏళ్ల నా కుమారుడిని రాజకీయ కక్షలతో టార్గెట్ చేశారు

 నా భర్త మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు

 రాజకీయ విభేదాలు ఉంటే నా భర్తతో పోరాడండి.. చిన్నారులను రాజకీయాల్లోకి లాగొద్దు

 కోర్టు తీర్పు రాకముందే మా కుటుంబాన్ని నేరస్తులుగా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయం?

 పోలీసుల దర్యాప్తు పూర్తికాకముందే రాజకీయ నాయకులు తీర్పులు ఇవ్వడం సరికాదు

 సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆవేదన

శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గంలోని కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పుల భోగయ్య మృతి చెందిన ఘటనపై బాధిత కుటుంబం చెబుతున్న అంశాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కుమారుడే వాహనం నడిపినట్లు బాధిత కుటుంబం చెబుతున్నా కేసు వేరే డ్రైవర్‌పైకి ఎలా మళ్లిందని నిలదీశారు. భోగయ్య కుటుంబానికి ఇచ్చిన హామీలు దాదాపు 20 నెలలు గడిచినా అమలు కాలేదని పేర్కొంటూ, కేసును రీ-ఓపెన్ చేసి స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఇదే సమయంలో తమ కుటుంబానికి సంబంధించిన ఘటనలో రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా వక్రీకరించి తన భర్తను, 18 ఏళ్ల కుమారుడిని లక్ష్యంగా చేసుకోవడం ఏకపక్ష న్యాయానికి నిదర్శనమని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని 7 బిర్యానీస్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో శ్రీదేవి ఏమన్నారంటే..

- భోగయ్య కుటుంబం చెబుతున్న వాస్తవాలపై విచారణ జరపాలి
చెప్పుల భోగయ్య ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. 2024 డిసెంబర్ 21న పాతపట్నం నియోజకవర్గంలోని కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఎమ్మెల్యే కుమారుడే వాహనం నడిపినట్లు బాధిత కుటుంబం బయటకు వచ్చి చెబుతున్నప్పుడు ప్రభుత్వం ఆ అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? కేసును వేరే డ్రైవర్ పేరుతోకి ఎలా మళ్లించారు? భోగయ్య కుటుంబానికి రూ.5 లక్షల సాయం, పెన్షన్, ఇతర సహాయం అందిస్తామని హామీలు ఇచ్చారు. దాదాపు 20 నెలలు గడిచినా అవి అమలు కాలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పిన కుటుంబానికి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ కేసును రీ-ఓపెన్ చేసి స్వతంత్రంగా విచారణ జరపాలి. ఎవరు వాహనం నడిపారు? కేసు ఎందుకు మారింది? బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదు? అన్నింటినీ తేల్చాలి. 

- ఒక కుటుంబానికి ప్రమాదం.. మరో కుటుంబానికి హత్య కేసా?
ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం హత్య కేసుగా వక్రీకరిస్తారా? మా 18 ఏళ్ల కుమారుడిని రాజకీయ కక్షలతో టార్గెట్ చేశారు. నా భర్త మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. రాజకీయ విభేదాలు ఉంటే నా భర్తతో రాజకీయంగా పోరాడండి. చిన్నారులను రాజకీయాల్లోకి లాగొద్దు. కోర్టులు ఉన్నాయి, పోలీసులు దర్యాప్తు చేయాలి. కానీ దర్యాప్తు పూర్తికాకముందే ప్రభుత్వం, రాజకీయ నాయకులు నిందితులుగా తేల్చడం ఎంతవరకు న్యాయం? ఒక కుటుంబానికి ప్రమాదం జరిగితే ఒక విధంగా, ప్రతిపక్ష కుటుంబానికి సంబంధించిన ఘటనలో మరో విధంగా చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. 

- సీదిరి అప్పలరాజు సేవలను రాజకీయ కక్షలతో మరుగునపరచలేరు
సీదిరి అప్పలరాజు ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. పదేళ్లుగా వైద్యుడిగా ప్రజలకు సేవ చేశారు. శ్రీకాకుళంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామానికి ఆయన సేవలు తెలుసు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కంచిలి, ఇచ్ఛాపురంతో పాటు ఒడిశా నుంచి కూడా రోగులు ఆయన వద్దకు వచ్చేవారు. 24 గంటలు వైద్య సేవలు అందించారు. పలాస వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట సమయంలో కూడా ముందుకు వెళ్లి ముగ్గురికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఇలాంటి సేవలు చేసిన వ్యక్తిని రాజకీయ కక్షల కోసం క్రిమినల్‌గా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయం? 

- ఒకే రాష్ట్రం.. ఒకే చట్టం.. ఒకే న్యాయం
భోగయ్య కేసును రీ-ఓపెన్ చేసి స్వతంత్రంగా విచారణ జరపాలి. వారికి ఇస్తామన్న రూ.5 లక్షల సాయం, పెన్షన్, ఇతర హామీలను వెంటనే అమలు చేయాలి. అధికార పార్టీకి చెందిన వ్యక్తి వాహనం నడిపితే ఒక చట్టం, ప్రతిపక్ష కుటుంబానికి సంబంధించిన ఘటనలో మరో చట్టం ఉండకూడదు. మా కుటుంబంపై కేసులు పెట్టి, సెక్షన్లు మార్చి, అరెస్టులు చేసి జైలుకు పంపినట్లే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబంపైనా అదే చట్టం, అదే సెక్షన్లు అమలు చేస్తారా? రాష్ట్రంలో అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వారికి అండగా ఉంటాం.  

Back to Top