రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే

శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులు నిండినా రైతులకు నీరు ఎందుకు ఇవ్వరు?

ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నా

అనంతపురం జిల్లా: ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రైతుల సాగునీటి సమస్యపై ధర్నా నిర్వహించారు. అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులు నీటితో నిండినా రాయలసీమ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించకపోవడంపై విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని, మరోవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి తరలింపు జరుగుతోందని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రైతుల పరిస్థితి ఏమిటని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ రైతులకు సాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని, రైతులకు సాగునీరు అందించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
 

Back to Top