శ్రీశైలం నీరు ఉన్నా.. రాయలసీమకు తాగునీరు ఎందుకు ఇవ్వరు?

పాలేరు వంకను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

ప్రజలకు గుక్కెడు మంచినీరు అందించకపోతే అవుకు రిజర్వాయర్‌ ముట్టడిస్తాం

నంద్యాల జిల్లా : సంజామల గ్రామ శివారులోని పాలేరు వంకను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు. పాలేరు వంక పరివాహక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కలుషితమైన నీటిని వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పరివాహక గ్రామాలకు గుక్కెడు మంచినీరు కూడా అందడం లేదని, వాసన వస్తున్న కలుషిత నీటితో స్నానాలు చేయాల్సి వస్తుండటంతో చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని కాటసాని రామిరెడ్డి తెలిపారు. వ్యవసాయానికి సాగునీరు అందించలేకపోతున్న ప్రభుత్వం కనీసం ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

సంజామల మండలంలోని ముక్కమల్ల, కానాల, రామభద్రునిపల్లె చెరువులను నింపి ఆయా గ్రామాలకు తాగునీరు అందించాలని కోరారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 873 అడుగులకు చేరినా రాయలసీమకు నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎస్‌ఆర్‌బీసీ కాలువకు నీరు విడుదల చేస్తే భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజల కనీస తాగునీటి అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే అవుకు రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్యప్రకాశ్ రెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, అంబటి రవి రెడ్డి, సన్నల జనార్ధన్ రెడ్డి, సంజామల గ్రామ నాయకులు తోట వెంకటేశ్వర రెడ్డి, తోట రామకృష్ణ రెడ్డి, ఉపేంద్ర రెడ్డి, దాసరి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ మక్బూల్ హుస్సేన్, తలారి రాముడు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top