కరువు కోరల్లో రాయలసీమ.. ప్ర‌భుత్వం మొద్దునిద్ర‌

 తెలంగాణ నీటి దోపిడీపై నోరు మెద‌ప‌రే

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల తీవ్ర ఆగ్ర‌హం

 అనంత‌పురం పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు. అనంత‌పురం జిల్లా పార్టీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైల‌జానాథ్‌

 రాయలసీమలో 39 శాతానికే పరిమితమైన ఖరీఫ్ సాగు.. 

 75 శాతం పడిపోయిన పాల ఉత్పత్తి.

 తెలంగాణ కరెంటు కోసం 53 టీఎంసీలు వృథా చేసినా ప‌ట్టించుకోరా? 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రైతుల త‌ర‌ఫున ప్రభుత్వమే ప్రీమియం కట్టింది  

 నేడు ఎండిన పంటలకు రైతులు సొంతంగా కట్టుకోవాల్సిన దుస్థితి

 తక్షణమే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలి 

 ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే శ్రీశైలం వద్ద పోరాటానికి సిద్ధం

  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల హెచ్చ‌రిక 

అనంత‌పురం: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాయలసీమలో సాగు, తాగునీరు, పశుగ్రాసం కొరత తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగు కేవలం 39-40 శాతం మాత్రమే జరగ్గా, భూగర్భ జలాలు 20 మీటర్ల మేర దారుణంగా పడిపోయాయని వివరించారు. సరైన మేత లేకపోవడంతో రాయలసీమలో పాల ఉత్పత్తి ఏకంగా 75 శాతం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి 53 టీఎంసీల నీటిని వృథాగా కిందికి వదిలేసినా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతుల తరఫున వేల కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తే, నేడు ఎండిపోతున్న పంటలకు రైతులే సొంతంగా ప్రీమియం కట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు, హంద్రీనీవాకు వెంటనే నీరు విడుదల చేయాలని, పోతిరెడ్డిపాడు ద్వారా కనీసం 30-40 టీఎంసీలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిద్ర నటించే ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు కరెంటు కోసం నీటిని వృథా చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని, రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రైతుల పక్షాన నిలబడి అవసరమైతే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఆందోళన చేసేందుకు కూడా వైయ‌స్ఆర్‌సీపీసిద్ధంగా ఉందని వారు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 

క‌ర‌వును ఎదుర్కొనే ప్ర‌ణాళికే లేదా?
- అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం ద్వారా కరువును పారద్రోలేందుకు శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌ల ఆధారంగా రాయలసీమలో అనేక ప్రాజెక్టులు నిర్మించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు లేక సాగు, తాగునీరు, పశుగ్రాసం అందించడంలో పూర్తిగా విఫలమైంది. ఎల్-నినో పేరుతో సైంటిఫిక్ కారణాలు చెబుతున్నారే తప్ప, కరువును ఎదుర్కొనే ప్రణాళిక వారి వద్ద లేదు. వర్షాభావం వల్ల సెప్టెంబర్ వచ్చినా రాయలసీమలో సగటున కేవలం 39-40 శాతం మాత్రమే ఖరీఫ్ సాగు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 46-47 శాతం వర్షపాతం లోటు ఉండగా, భూగర్భ జలాలు దారుణంగా పడిపోయి 12 నుంచి 20 మీటర్ల మేర అడుగంటాయి. పచ్చిగడ్డి, సరైన మేత లేకపోవడం వల్ల రాయలసీమలో పాల ఉత్పత్తి ఏకంగా 75 శాతం పడిపోయింది. మరోవైపు శ్రీశైలంలో నీటిమట్టం 875 అడుగులు దాటినప్పుడు, కరెంటు ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 53 టీఎంసీల నీటిని కిందికి వదిలేసినా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ దీనిపై ముందే హెచ్చరించారు. తెలంగాణ కరెంటు కోసం నీళ్లు వాడుతుంటే, ఆ నీళ్లు నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాకు వెళ్తాయి కదా అని సాక్షాత్తూ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి మాట్లాడటం రాయలసీమ పట్ల వారికున్న చిన్నచూపుకు నిదర్శనం. గత ఐదేళ్లలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం రైతుల తరఫున రూ. 8,600 కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి, రూ. 11,000 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వగా.. నేడు ఎండిపోతున్న పంటలకు సైతం రైతులు సొంతంగా ప్రీమియం కట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది.

రైతుల పక్షాన పోరాడుతాం
- సాకె శైలజానాథ్, మాజీ మంత్రి

నిద్రపోయే వాళ్లని లేపొచ్చు కానీ, నిద్ర నటించే వాళ్లను లేపలేమని ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తే అర్థమవుతోంది. తమ బతుకు కోసం, తమ పంటల కోసం రాయలసీమ రైతాంగం ఇప్పటికే రోడ్డెక్కుతున్నారు. ఉరవకొండలో రాస్తారోకో జరగ్గా, ఒకటో తేదీన నందికొట్కూరులో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వృథా చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణమే నియంత్రించాలి. కొంత డబ్బు వెచ్చించి కరెంటు కొనుక్కోవచ్చు కానీ, నీళ్లు కొనలేమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. కరెంటు కోసం నీటిని కిందకు వదిలేయడం వల్ల శ్రీశైలంలో 160 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది, ఇదే తీరు కొనసాగితే రాయలసీమ ప్రాజెక్టులకు, హంద్రీనీవాకు చుక్క నీరు కూడా రాదు. మా ఒకే ఒక్క డిమాండ్ ఏంటంటే.. శ్రీశైలం నుండి రాయలసీమ ప్రాజెక్టులకు, తెలుగు గంగ, మద్రాస్ తాగునీరు, హంద్రీనీవాకు వెంటనే నీరు విడుదల చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కనీసం 30-40 టీఎంసీలు కిందికి తీసుకోవాలి. రాయలసీమలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని, రైతులను కాపాడాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించి తక్షణమే ఆదుకోవాలి. రైతులు అధైర్యపడొద్దు, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది. అవసరమైతే శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిలబడి పోరాటం చేసేందుకు కూడా వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది.

Back to Top