వినుకొండ: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పల్నాడు రైతాంగం సాగునీరు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోందని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. గతంలో శంకుస్థాపన చేసిన గోదావరి జలాల అనుసంధాన ప్రాజెక్టును పక్కన పెట్టడంతో పల్నాడు రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని గతంలో చెప్పిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడటం లేదని బొల్లా ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరసరావుపేటకు వచ్చిన సమయంలోనైనా పల్నాడు రైతుల ప్రధాన సమస్యను ఆమె దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. ఆరు లక్షల ఎకరాలకు సాగునీటి అవకాశం రాయపాడు వద్ద గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువకు అనుసంధానం చేసే ప్రాజెక్టును సుమారు రూ.6 వేల కోట్లతో పూర్తి చేసి ఉంటే పల్నాడులో దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని బొల్లా తెలిపారు. రైతులు మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాల సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యేవని బొల్లా తెలిపారు. కీలకమైన ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో కొత్త నినాదాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. రైతులకు బీమా, రుణాల భారం వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ-క్రాప్ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని బొల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బీమా పరిహారం అందించడంలో విఫలమైందన్నారు. పంటలు పండక, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను సొసైటీ రుణాల వసూళ్ల పేరుతో వేధించడం సరికాదన్నారు. అబద్ధపు హామీలు, రాజకీయ కక్షసాధింపులను పక్కనపెట్టి పల్నాడు రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. గతంలో శంకుస్థాపన చేసిన గోదావరి జలాల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు వరికపూడిశెల ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లి పల్నాడు రైతులకు సాగు, తాగునీరు అందించాలని స్పష్టం చేశారు.