తాడేపల్లి: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 26 నెలల కాలంలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయాయని, కానీ దుబారా, దోపిడీ, అవినీతి, అప్పులు మాత్రం అన్‌స్టాపబుల్‌గా సాగుతున్నాయని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఏకంగా శ్రీలంక, వెనిజులా దేశాల పరిస్థితికి దిగజార్చారని ఆయన ధ్వజమెత్తారు. రోజుకు సగటున రూ.495 కోట్ల చొప్పున అప్పు చేస్తూ రాష్ట్ర ప్రజలపై 26 నెలల్లో ఏకంగా రూ.3.86 లక్షల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతికి చిల్లిగవ్వ ఇవ్వకపోయినా, పబ్లిసిటీ, విమానాల షికార్లకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరి వెంకటరెడ్డి గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లో కారుమూరి వెంకటరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ‘అన్‌స్టాపబుల్ అప్పు’: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకపోయినా, అన్‌స్టాపబుల్‌గా అప్పు మాత్రం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కోవిడ్ పరిస్థితి ఉన్నా, రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం ఆపలేదు. పైగా గత ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో చేసిన అప్పు రూ.3,31,671 కోట్ల అప్పును, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే దాటేసింది. ఇక ఆ అప్పుకు సంబంధించి చూస్తే, బడ్జెట్ లోపల రూ.2.18 లక్షల కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రూ.1.20 లక్షల కోట్లు, రాజధాని పేరుతో రూ.47 వేల కోట్లు అప్పులు చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం సగటున నెలకు రూ.14,859 కోట్లు, రోజుకు రూ.495 కోట్లు, గంటకు రూ.20.68 కోట్ల అప్పు చేస్తోంది. ఒక్కరోజు వీళ్లు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయొచ్చు. ఇంత అప్పు చేస్తున్న వీళ్లకు పథకాలు అమలు చేయడానికి మాత్రం డబ్బులు లేవట! నాడు అప్పు చేసినా ప్రజలకు మేలు: నాడు జగన్‌గారి హయాంలో అప్పు చేసినా, దానికి పక్కా లెక్కలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరోక్ష నగదు సాయం (నాన్ డీబీటీ) ద్వారా ప్రజలకు రూ.4,58,360 కోట్లు అందించారు. అంతే కాకుండా నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు సమగ్రంగా మార్చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వాటిలో అయిదింటిని పూర్తి చేశారు. 4 పోర్టులతో పాటు, షిఫింగ్ హార్బర్లు నిర్మించారు. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధించారు. అప్పులు చేసి దుబారా వ్యయం. ప్రజాధనంతో జల్సాలు: అప్పుల పేరుతో 26 నెలలుగా తెచ్చిన ధనంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ జల్సాలు చేస్తున్నారు. కరకట్టపై ఉన్న టెంపరరీ ఇంటికి రూ.3.44 కోట్లు, ఆ ఇంటికి వెళ్లే దారిలో డెకరేషన్ లైట్లకు రూ.5.40 కోట్లు, ఢిల్లీ బంగళా మరమ్మతులు, మీటింగ్ హాల్‌కు కలిపి రూ.7.18 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారు. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, షాడో సీఎం.. అలా ముగ్గురు సీఎంలు ఉన్నారు. వీరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు రూ.9.20 కోట్లు, వీరు గాల్లో తిరిగే విమానాలు, హెలికాప్టర్ల కోసమే రెండేళ్లలో ఏకంగా రూ.110 కోట్లు ఖర్చు చేశారు. టీవీలు, పేపర్ల యాడ్స్ కోసం సంవత్సరానికి రూ.747 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.1500 కోట్లు కేటాయించారు. లోకేష్ ’రైజింగ్ స్టార్’ అంటూ ఇంగ్లీష్ మ్యాగజైన్ల ఫ్రంట్ పేజీలకు కోట్లు సమర్పించుకున్నారు. సభలు, సమావేశాల ముసుగులో దోపిడీ: రామోజీరావు వర్ధంతి సభకు రూ.10 కోట్లు, భువనేశ్వరి గారి ’నారా భేరి’ సభకు రూ.5 కోట్లు, అమరావతి ఆవకాయకు రూ.5 కోట్లు ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్‌కు ఏడాదికి రూ.50 కోట్లు. విశాఖ యోగాంధ్రా సభకు రూ.300 కోట్లు, భోగాపురం మీటింగ్‌కి రూ.50 కోట్లు, అమరావతి శంకుస్థాపనకు రూ.500 కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. దావోస్ పర్యటనలో పెట్టుబడులు గుండుసున్నా అయినా, జాతీయ మీడియాకు రెండు సార్లు చెరో రూ.5 కోట్లు ఇచ్చి కవర్ చేసుకున్నారు. నీరుకొండలో 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి, డీపీఆర్ రూపకల్పనకు రూ.11.56 కోట్లు ఇచ్చారు. ’మంచి ప్రభుత్వం’ అని ఇంటింటికీ స్టిక్కర్లు అంటించుకునే కార్యక్రమానికి రూ.5.67 కోట్లు ఖర్చు పెట్టారు. అడ్డగోలుగా సలహాదారులు. బినామీ కాంట్రాక్టులు: రూ.5 భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ల చైర్మన్, సీఈవోల జీతాలకే నెలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 34 మంది సలహాదారులు ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ పేరుతో 175 మంది కన్సల్టెంట్లకు నెలకు రూ.60 వేల చొప్పున నాలుగేళ్లకు రూ.50.40 కోట్లు దోచి పెడుతున్నారు. అమరావతిలో కి.మీ రోడ్డు వేయడానికి ఏకంగా రూ.160 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు. బినామీలు బలుసు శ్రీనివాసరావు లాంటి వారికి, అంచనాలు పెంచి మరీ కాంట్రాక్టులు అప్పగిస్తూ దోచి పెడుతున్నారు. ప్రతి ఒకటో తారీఖు డ్రామాలు: ప్రతి ఒకటో తారీఖున బాబు గ్యాస్ పొయ్యి వెలిగించకుండా వంటలు చేయడం, ఆటో నడపడం లాంటి డ్రామాల పబ్లిసిటీ కోసం రోజుకు కోటి రూపాయలు దుబారా చేస్తున్నారు. కలెక్టర్ల సదస్సు పెడితే ఒక్కో ప్లేటు భోజనానికి రూ.3200 చొప్పున కేవలం రెండు రోజుల భోజనాలకే రూ.1.20 కోట్లు ఖర్చు చేశారు. మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకు ఇప్పటి వరకు ఏకంగా రూ.15.80 కోట్లు, ముకుల్ రోహత్గీకి రూ.80 లక్షలు ప్రజాధనాన్ని అప్పనంగా ఇచ్చేశారు. గ్రామాల్లో జగన్‌గారి ముద్ర చెరిపేయాలని, కనీసం ఆఫీసు కూడా లేని ’నెక్సో్టరా సొల్యూషన్స్’ అనే బినామీ కంపెనీకి సచివాలయాల బోర్డులు మార్చేందుకు రూ.13.88 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు.