వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు అంబటి సురేష్‌ కిడ్నాప్‌..  

ఫ్లైఓవర్‌ పనులపై ప్రశ్నించినందుకే టీడీపీ నేత‌ల దాడి 

అండ‌గా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ నరేన్‌ రెడ్డి

వైయ‌స్ఆర్‌ జిల్లా: రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులకు సంబంధించి బాధితుల సమస్యలపై మాట్లాడుతున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు అంబటి సురేష్‌ను టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి అనుచరులు కిడ్నాప్‌ చేసి దాడి చేశారని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. క‌మ‌లాపురం ప‌ట్ట‌ణంలోని రామాలయం సమీపంలో ఉన్న సురేష్‌ను మెడ పట్టుకుని ఆటోలో ఎక్కించుకుని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని పేర్కొన్నారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులతో 130 మంది బాధితులు ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాను మాట్లాడుతున్నందుకే తనపై దాడి చేశారని అంబటి సురేష్‌ తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్నాననే కారణంతో పుత్తా అనుచరులు తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో తనను ఉంచి భయబ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సురేష్‌ కిడ్నాప్‌ విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ నరేన్‌ రెడ్డి ఆయనను తీసుకొచ్చేందుకు టీడీపీ కార్యాలయం వైపు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. సురేష్‌ను బయటకు తీసుకొస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు టీడీపీ కార్యాలయం నుంచి అంబటి సురేష్‌ను బయటకు తీసుకువచ్చారు. సురేష్‌పై జరిగిన దాడి ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అంబటి సురేష్‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ నరేన్‌ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అంబటి సురేష్‌ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి బాధితులు 130 మంది ఉండగా, తనను మాత్రమే పిలిపించి దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ నరేన్‌ రెడ్డి బాధితులను పరామర్శిస్తుంటే ఆయన వెంట ఉన్నాననే కారణంతో కూడా తనను కొట్టారని తెలిపారు. నరేన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న సురేష్‌పై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడనే కారణంతో ఆటోలో ఎక్కించుకుని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి కొట్టారని తెలిపారు. నష్టపరిహారం విషయంలో కాంట్రాక్టర్లకు పెంచిన రేట్ల ప్రకారం బాధితులు అడుగుతున్నారని, వారి సమస్యలను ప్రశ్నించినందుకే దాడులకు పాల్పడటం సరికాదన్నారు.

భయపెడితే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు భయపడరని నరేన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటిస్తామని తెలిపారు. అంబటి సురేష్‌కు పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
 

Back to Top