గుడివాడ : కృష్ణా డెల్టాలో సాగులో ఉన్న ఖరీఫ్ వరి పంటను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే సాగునీరు విడుదల చేయాలని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.యస్. నాగిరెడ్డి కోరారు. తగినంత నీటిని అందించలేని పరిస్థితి ఉంటే కృష్ణా డెల్టాను పూర్తి కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులకు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీతో పాటు పంట నష్టపరిహారం అందించాలని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే సుమారు 1.21 లక్షల హెక్టార్లలో సాగు జరిగిందని, అందులో సుమారు 1.19 లక్షల హెక్టార్లలో వరి సాగైనట్లు నాగిరెడ్డి తెలిపారు. ఈ దశలో రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మారడం ఆచరణలో సాధ్యం కాదని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, యంత్రాల కోసం రైతులు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టారని, కీలక దశలో సాగునీరు అందకపోతే మొత్తం పెట్టుబడి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టాలో వరి సాగు కేవలం ఒక పంటకు సంబంధించిన అంశం కాదని, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ, నేల స్వభావం, రైతుల అనుభవం, మార్కెట్ వ్యవస్థతో ముడిపడిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని నాగిరెడ్డి వివరించారు. ఇప్పటికే సాగులో ఉన్న వరి పంటను వదిలి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించడం కంటే, ప్రస్తుత పంటను కాపాడేందుకు అవసరమైన నీటిని అందించడమే ప్రభుత్వ తక్షణ బాధ్యత అని అన్నారు. కాలువల ద్వారా తగినంత నీరు అందక పలువురు రైతులు ఆయిల్ ఇంజిన్లు, ఇతర మార్గాల ద్వారా నీటిని అందించుకుంటున్నారని, దీనివల్ల సాగు వ్యయం మరింత పెరుగుతోందని తెలిపారు. రైతులపై అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కృష్ణా డెల్టా కాలువలకు కనీసం 10,000 క్యూసెక్కుల నీటిని అవసరమైన కాలం వరకు సమర్థవంతంగా విడుదల చేయాలని కోరారు. సాగులో ఉన్న పంటకు అవసరమైన నీటిని అందించగలిగితే ప్రభుత్వం వెంటనే నీరు విడుదల చేసి పంటను కాపాడాలని నాగిరెడ్డి సూచించారు. నీరు అందించడం సాధ్యం కాని పరిస్థితి ఉంటే పంట నష్టాన్ని ముందుగానే గుర్తించి కృష్ణా డెల్టాను వ్యవసాయ ఎమర్జెన్సీగా పరిగణించి కరువు ప్రాంతంగా ప్రకటించాలని అన్నారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని, నీటి కొరత కారణంగా రైతులపై పడిన అదనపు సాగు వ్యయాన్ని కూడా పరిహారంలో పరిగణించాలని కోరారు. కృష్ణా డెల్టా రైతులు రాష్ట్ర ఆహార భద్రతకు, ముఖ్యంగా వరి ఉత్పత్తికి కీలకంగా ఉన్నారని నాగిరెడ్డి పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుత నీటి సమస్యను కేవలం సాగునీటి విడుదల అంశంగా కాకుండా రైతుల పెట్టుబడి, పంట భద్రత, కుటుంబ ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని సూచించారు. కృష్ణా డెల్టా రైతులు నీటి కోసం అనిశ్చితిలో ఎదురుచూసే పరిస్థితిని ప్రభుత్వం వెంటనే ముగించాలని, సాగులో ఉన్న పంటను కాపాడేందుకు అవసరమైన నీటిని అందించాలని నాగిరెడ్డి స్పష్టం చేశారు. నీరు అందించడం సాధ్యం కాకపోతే కరువు ప్రకటించి రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని, రైతు పంట, పెట్టుబడి, కుటుంబ ఆదాయాన్ని కాపాడే నిర్ణయం ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలని కోరారు.