వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదు

గూడూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య

గూడూరు: దేవస్థాన భూముల వేలంపాటలో జరిగిన పరిణామాలపై, తనపై వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలపై గూడూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య ఘాటుగా స్పందించారు.శుక్రవారం గూడూరులోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయ‌కుడు ప‌ల్లీ కోటేశ్వ‌ర‌రావుతో క‌లిసి ఆయన మాట్లాడుతూ.. దేవస్థాన భూముల వేలంపాట వ్యవహారంలో వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్పష్టం చేశారు. వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. ధర్మరాజుల దేవస్థానం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన భూముల వేలంపాటపై డీసీ ఆగ్రహం వ్యక్తం చేసి వేలంపాటను రద్దు చేసిన విషయం వాస్తవం కాదా అని గురవయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగేలా వేలంపాట జరిగిందని డీసీ పేర్కొన్న విషయం కూడా వాస్తవం కాదా అని నిలదీశారు. వేలంపాటను రద్దు చేసిన అనంతరం సెప్టెంబర్ 9న తిరిగి వేలంపాట నిర్వహించాలని డీసీ ఆదేశించిన విషయం వాస్తవం కాదా అని గురవయ్య ప్రశ్నించారు. వేలంపాటలో పాల్గొన్న వ్యక్తి డీసీ ఎదుట రూ.15 లక్షలు నష్టపోయానని, వేలంపాటను రద్దు చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

ఎఫ్‌ఐఆర్‌ ఉంటే బయటపెట్టండి

తనపై ఉద్యోగాల పేరుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందంటూ చేస్తున్న ప్రచారంపై గురవయ్య తీవ్రంగా స్పందించారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని చెబుతున్న ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఆ ఎఫ్‌ఐఆర్‌ను బహిరంగంగా చూపించాలని సవాల్‌ చేశారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులు, ఆరోపణలకు తాను ఏమాత్రం భయపడేది లేదని గురవయ్య స్పష్టం చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న బెదిరింపులకు అదరేది, బెదిరేది లేదని తేల్చిచెప్పారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలని, లేకపోతే వాస్తవాలను వక్రీకరించవద్దని అన్నారు. దేవస్థాన భూముల వేలంపాట వ్యవహారంలో జరిగిన పరిణామాలపై సమగ్రంగా వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని గురవయ్య పేర్కొన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు చేసినా చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
 

Back to Top