ప్రజా ఆస్తుల దోపిడీకే పీపీపీ విధానం

ఏపీని అమ్మకానికి పెట్టే కుట్రలో భాగమే పీపీపీ -2026 విధానం

మాజీ మంత్రి క‌న్న‌బాబు ధ్వ‌జం  

కాకినాడలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు 

వీజీఎఫ్(వైబిలిటీ గ్యాప్ ఫండ్‌) పేరుతో ప్రైవేటుకు దోచిపెట్టే కుట్ర 

ప్రభుత్వం భూములు, నిధులు ఇస్తూ... ప్రజల నుంచే యూజర్ చార్జీలు వసూలు చేస్తారా?

రూ.1.23 లక్షల కోట్ల పీపీపీ ప్రాజెక్టుల పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలి

విద్య, వైద్యం, తాగునీరు, సాగునీటిని ప్రైవేట్ పరం చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం

ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు కట్టబెట్టే విధానాన్ని వెంటనే ఉపసంహరించాలి

కుర‌సాల క‌న్నబాబు డిమాండ్ 

కాకినాడ‌: పీపీపీ- 2026 పాలసీ పేరుతో తరతరాలకు నష్టం చేసే కొత్త విధానానికి వెన్నుపోటు కూట‌మి ప్రభుత్వం తెరతీసిందని, ఏపీ ఫర్ సేల్ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టిన‌ట్టుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ - 2026 విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ల పక్షాన నిలబడి రాష్ట్ర వనరులు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ప్రజల కోసం కాదని, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, తన మద్దతుదారుల కోసం అన్న విషయం ఇప్పుడు స్పష్టమైందని అన్నారు. 

రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులు పీపీపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్‌లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, 2026-27లో పెట్టుబడిదారులకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.1,500 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతోందని తెలిపారు. ప్రభుత్వమే భూములు, పెట్టుబడికి డబ్బులు, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తూ... చివరికి ప్రజల నుంచే యూజర్ చార్జీలు వసూలు చేసుకునే అవకాశం ప్రైవేట్ సంస్థలకు కల్పిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు, వనరులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాటిపై ప్రజల నుంచే యూజర్ చార్జీలు వసూలు చేసే విధానాన్ని తీసుకురావడం దోపిడీకి ద్వారాలు తీయడమేనని అన్నారు. రోడ్లు, పోర్టులు, విద్య, వైద్యం, తాగునీరు, మురుగునీటి పారుదల, సాగునీరు, పబ్లిక్ భవనాలు, హౌసింగ్, టూరిజం, డేటా సెంటర్లు, పార్కులు తదితర రంగాలను పీపీపీ కింద ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. పీపీపీ ఇవ్వకుండా ప్రభుత్వం మిగిల్చిన రంగం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే చివరకు ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

- 'సంపద సృష్టి' అనే ముసుగులో ఆస్తుల దోపిడీ

వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. 'సంపద సృష్టి' అనే ముసుగులో రాష్ట్రాన్ని, మన ప్రభుత్వ ఆస్తులను నిస్సిగ్గుగా అమ్మకానికి పెట్టారు. నేడు రాష్ట్రం పరిస్థితి 'ఏపీ ఫర్ సేల్' (అమ్మకానికి ఆంధ్రప్రదేశ్) అన్నట్లుగా మారిపోయింది. వీళ్లు సంపద సృష్టిస్తున్నది రాష్ట్ర ప్రజల కోసం కాదు, కేవలం కార్పొరేట్ల కోసం, తమ అనుయాయుల కోసం మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇప్పుడు కొత్తగా పీపీపీ- 2026 పాలసీ పేరుతో ఒక అతిపెద్ద స్కామ్‌కు తెరతీశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానం కింద, పైప్‌లైన్‌లో ఉన్న ఏకంగా రూ. 1,23,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను తమకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్‌) పేరుతో 2026-27 సంవత్సరానికి సుమారు రూ. 1,500 కోట్లు ప్రజల సొమ్మును ఆ ప్రైవేట్ వాళ్లకు ఉచితంగా పంచిపెట్టేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయించడం అత్యంత దుర్మార్గం.

- జేబులు కత్తిరించేలా యూజర్ చార్జీలు వ‌సూలు

రోడ్లు, పోర్టులు, విద్య, వైద్యం, తాగునీరు, మురుగునీటి పారుదల, సాగునీరు, పబ్లిక్ భవనాలు, పార్కులు, డేటా సెంటర్లు... ఇలా ప్రతి ఒక్క రంగాన్నీ పీపీపీ కింద ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. అసలు ఈ రాష్ట్రంలో వీరు ప్రైవేటీకరణ చేయని రంగం ఏదైనా ఉందా?  ఇంకో దారుణం ఏంటంటే... ఆ ప్రైవేట్ ప్రాజెక్టులకు మన ప్రభుత్వమే ఉచితంగా భూములు ఇస్తుంది, వడ్డీలేని రుణాలు ఇప్పిస్తుంది, నిర్వహణ కోసం మళ్ళీ నిధులు కూడా ఇస్తుంది. కానీ, లాభాల కోసం వాళ్ళు మాత్రం సామాన్యుల నుంచి ముక్కుపిండి "యూజర్ చార్జీలు" వసూలు చేసుకుంటారు. ఆసుపత్రులు, స్కూళ్లు, పార్కులు, చివరికి తాగునీటి సేవలకు కూడా మన జేబులు కొట్టేలా, ప్రజలపై ఈ యూజర్ చార్జీల భారం మోపేలా ఈ పాలసీలో ప్రైవేట్ వారికి అవకాశమిచ్చారు.

- ప్ర‌జ‌ల ఆస్తులు ప్రైవేట్‌కి అప్ప‌గించే కుట్ర 

జగన్‌ గారి ప్రభుత్వం నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు గతంలో ప్రయత్నించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. రోడ్లను ప్రైవేట్‌కు అప్పగించి టోల్ వసూలు చేసే విధానం తీసుకొస్తున్నారు. ప్రభుత్వ మార్కెట్లు, బస్ టెర్మినల్స్, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యం, పబ్లిక్ గార్డెన్లు, పార్కులు వంటి ప్రజా ఆస్తులను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజా వనరులకు కస్టోడియన్ మాత్రమే తప్ప యజమాని కాదు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికారంతో ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా పంచే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బును ప్రైవేట్ సంస్థలకు గ్రాంట్లు, రాయితీలు, రుణాలు, వడ్డీ మినహాయింపుల రూపంలో దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసం? 

- ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం

ప్రైవేట్ సంస్థలకు డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, రుణాలు ప్రభుత్వం ఇప్పిస్తుంది, వడ్డీలు ప్రభుత్వం కడుతుంది. ప్రైవేట్ సంస్థలు మాత్రం ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసుకుంటాయి. పార్కులో నడిచినా చార్జీ, ఆసుపత్రికి వెళ్లినా చార్జీ, విద్య కోసం చార్జీ, తాగునీటికి చార్జీ, పారిశుద్ధ్యానికి చార్జీ విధించే పరిస్థితి వస్తే పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎలా భరిస్తారు?  తాగునీటిని, సాగునీటిని కూడా వ్యాపారంగా ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు? ప్రజలకు అత్యవసరమైన సేవలను యూజర్ చార్జీల పేరుతో ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల విషయంలో కూడా పీపీపీ విధానం అత్యంత ప్రమాదకరం. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సదుపాయాలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉపయోగించుకుని, అక్కడికి వచ్చే రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసే అవకాశం కల్పించడం పేదలపై భారం మోపడమే. పీపీపీ విధానంలో కమర్షియల్ వైబిలిటీ, కాస్ట్ రికవరీ, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లకే ప్రాధాన్యత ఇచ్చారు. మరి ప్రజా ప్రయోజనం ఎక్కడ ఉంది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ పీపీపీ మోడల్ ప్రజాహితం ఏమాత్రం కాదు. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తులను 'పీల్చి, పిండి, పిప్పి చేసే' దోపిడీ కార్యక్రమం. తక్షణమే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదా ప్రజల ముందు బహిరంగ చర్చకు పెట్టాలి. లేనిపక్షంలో ప్రజల తరపున తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.

ప్ర‌భుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్లు

* వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చులో 20 నుంచి 40 శాతం వరకు ప్రభుత్వం భరించే విధానం తీసుకొచ్చారు. రూ.1,000 కోట్ల ప్రాజెక్టుకు 20 శాతం అంటే రూ.200 కోట్లు, 30 శాతం అయితే రూ.300 కోట్లు, 40 శాతం అయితే రూ.400 కోట్లు ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఇది ప్ర‌జ‌లపై భారం మోప‌డ‌మే. ప్రభుత్వ భూమి విలువను, భూ ఆధారిత చార్జీలను సక్రమంగా లెక్కించకుండా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తే ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే భూమి విలువను కూడా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో తప్పనిసరిగా లెక్కించాలి. 
* ప్రతి పీపీపీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలి. ఏ ప్రాజెక్టును ఎవరికి ఇస్తున్నారు? ఎంత భూమి ఇస్తున్నారు? ఆ భూమి మార్కెట్ విలువ ఎంత? ప్రైవేట్ సంస్థ ఎంత పెట్టుబడి పెడుతుంది? ప్రభుత్వం ఎంత ఇస్తుంది? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంత? పన్ను రాయితీలు ఎంత? యూజర్ ఫీజులు ఎంత? అనే అన్ని వివరాలను ప్రాజెక్టు వారీగా బహిర్గతం చేయాలి.
* ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, ఫైనాన్షియల్ మోడల్, ల్యాండ్ వాల్యుయేషన్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రిపోర్ట్, కన్సెషన్ అగ్రిమెంట్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి.
* 1.23 లక్షల కోట్ల పీపీపీ ప్రాజెక్టుల పూర్తి వివరాలు, మీరు ఆయా సంస్థలకు ఇస్తున్న భూముల విస్తీర్ణం, వాటి మార్కెట్ విలువను వెంటనే బహిర్గతం చేయాలి.
* ఏయే ప్రాజెక్టులకు ఎంత వీజీఎఫ్ ఫండ్ ఇస్తున్నారు? ప్రభుత్వం వదులుకుంటున్న స్టాంప్ డ్యూటీ, ట్యాక్స్ రిబేట్ల వివరాలను వెంటనే పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి.
* సామాన్య ప్రజల నుంచి మీరు వసూలు చేయబోయే యూజర్ ఫీజుల వివరాలను, ఈ దోపిడీ నుంచి పేద-మధ్యతరగతి వర్గాలకు ఉండే చట్టపరమైన రక్షణ ఏమిటో పారదర్శకంగా ప్రకటించాలి అని క‌న్నబాబు డిమాండ్ చేశారు.

Back to Top