విజయవాడ: వెన్నుపోటు పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక విధ్వంసం జరుగుతోందని.. పారిశ్రామికవేత్తలపై బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గూడపురెడ్డి శేఖర్ రెడ్డి ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్ పేరుతో పరిశ్రమలను భయభ్రాంతులకు గురిచేస్తూ, రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని సర్వనాశనం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలన్నా, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తమ కార్యకలాపాలను కొనసాగించాలన్నా క్యాష్ సూట్‌కేసు, రాజేష్, లోకేష్ పాలసీని ఫాలో కావాలని విమర్శించారు. సూట్ కేసులో క్యాష్‌ని సర్ది రాజేష్ ద్వారా లోకేష్‌కి పంపిస్తే తప్ప, ఆ పరిశ్రమ రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించడం అసాధ్యమని మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ అనుసరిస్తున్న ఈ విధానం పెట్టుబడిదారులను భయపెడుతోందని శేఖర్ రెడ్డి ఆరోపించారు. పరిశ్రమలకు భూములు కేటాయించాలన్నా, ప్రభుత్వ అనుమతులు పొందాలన్నా, ప్రాజెక్టులకు సహకారం అందాలన్నా ఒక రకమైన కప్పం, ముడుపుల సంస్కృతి కొనసాగుతోందని శేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... క్యాష్, సూట్‌కేస్, రాజేష్, లోకేష్ సంస్కృతి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే క్యాష్, సూట్‌కేస్, రాజేష్, లోకేష్ సంస్కృతి నడుస్తోంది. క్యాష్‌ను సూట్‌కేస్‌లో పెట్టి రాజేష్ ద్వారా నారా లోకేష్‌కు పంపిస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయనే పరిస్థితిని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పరిశ్రమలకు భూములు కేటాయించడం, అనుమతులు ఇవ్వడం, ప్రభుత్వ విభాగాల నుంచి క్లియరెన్సులు రావడం, స్థానికంగా వెన్నుపోటు పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు లేకుండా పరిశ్రమలు నడవడం వంటి ప్రతి అంశంలోనూ ఈ ముడుపుల సంస్కృతి అడ్డంకిగా మారింది. క్యాష్, సూట్‌కేసులు ఇచ్చే పరిస్థితి లేకపోతే పరిశ్రమలపై వెన్నుపోటు పార్టీ నాయకుల దాడులు, బెదిరింపులు, వేధింపులు కొనసాగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు తమ వ్యాపార కార్యకలాపాల కంటే ముందు స్థానిక రాజకీయ నాయకులను ఎలా సంతృప్తిపరచాలనే ఆలోచించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. పెట్టుబడిదారుల్లో సన్నగిల్లిన విశ్వాసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించాల్సింది పోయి, వారిలో భయాందోళనలు కలిగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ క్యాష్, సూట్‌కేస్ సంస్కృతి కారణంగానే పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. జమ్మలమడుగు సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్‌పై స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఒత్తిళ్లు, దాడులు, వేధింపులు జరిగాయి. పరిశ్రమకు అవసరమైన ముడి సరుకును అడ్డుకున్నారు, కేసులు పెట్టారు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను వెన్నుపోటు పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. కృష్ణపట్నం, తాడిపత్రి, గండికోట, కాకినాడ పోర్టు, ప్రకాశం, శ్రీకాకుళం, రామాయపట్నం తదితర ప్రాంతాల్లో పరిశ్రమలపై వాటాలు, కప్పాల కోసం ఒత్తిళ్లు తెస్తున్నారు. సిమెంట్ పరిశ్రమలే టార్గెట్‌గా.. రాష్ట్రంలోని సిమెంట్ పరిశ్రమలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అల్ట్రాటెక్, జువారీ, ఎల్‌అండ్‌టీ, దాల్మియా, సాగర్, చెట్టినాడు, భవ్య సిమెంట్స్ వంటి పరిశ్రమలపై వివిధ రకాలుగా ఒత్తిళ్లు తెచ్చారు. కప్పం చెల్లించకపోతే పరిశ్రమలు నడపనివ్వమనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎర్రగుంట్లలో 17 సంవత్సరాలుగా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్‌ను కూడా వెన్నుపోటు కూటమి ప్రభుత్వం, వెన్నుపోటు పార్టీ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. భారతీ సిమెంట్స్‌కు వెళ్లే కార్మికులను అడ్డుకుంటున్నారు. పరిశ్రమకు అవసరమైన లైమ్‌స్టోన్ ముడి ఖనిజాన్ని రానివ్వడం లేదు. రోడ్లపై లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. భారతీ సిమెంట్స్‌లో ఉత్పత్తి నిలిచిపోతే వేలాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగుల జీవితాలు ప్రభావితమవుతాయి. పరిశ్రమలను బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ యంత్రాంగం మౌనం వహిస్తోంది. రెండేళ్లలో రూ.12,890 కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12,890 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. టాటా పవర్, కోకాకోలా, ఆజాద్ మొబిలిటీ, జిన్ఫ్రా, జూపిటర్ రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. వాస్తవంగా సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. పెట్టుబడులపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవ పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదు. వైఎస్ జగన్ గారి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. అలాంటి ప్రభుత్వాన్ని పారిశ్రామిక విధ్వంసక ప్రభుత్వంగా విమర్శిస్తున్న వెన్నుపోటు పార్టీ నేతలు, ప్రస్తుత పారిశ్రామిక పరిస్థితిపై సమాధానం చెప్పాలి. పరిశ్రమలను బెదిరిస్తూ, ఉత్పత్తులను అడ్డుకుంటూ, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారే నిజమైన పారిశ్రామిక విధ్వంసకులు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే పరిశ్రమలపై జరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టాలి. భారతీ సిమెంట్స్ సహా అన్ని పరిశ్రమలకు భద్రత కల్పించాలని వీరశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.