అన్నమయ్య జిల్లా: చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘నేతన్నల సేవలో’ పథకం అన్నమయ్య జిల్లాలో పారదర్శకతకు దూరంగా సాగుతోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. జీఓ నం.187, తేదీ 29-07-2026 మార్గదర్శకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, అర్హులైన నేతన్నలకు అన్యాయం జరగకుండా సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ మాట్లాడుతూ.. పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. స్థానిక కూటమి నాయకులు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేశారని, వారి కనుసన్నల్లోనే ఎంపిక జరిగిందని పేర్కొన్నారు. ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేశారు? క్షేత్రస్థాయి పరిశీలన ఎవరు చేశారు? తుది ఆమోదం ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. లబ్ధిదారుల జాబితాను బహిరంగపరచాలి వైయస్ఆర్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు శీలం రమేశ్ మాట్లాడుతూ.. రాజకీయ పలుకుబడితో అనర్హులకు ప్రయోజనం కల్పించి, అర్హులైన నేతన్నలను పక్కన పెడితే సహించేది లేదన్నారు. దరఖాస్తుదారుల వివరాలు, తుది లబ్ధిదారుల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. జిల్లా చేనేత విభాగం కార్యదర్శి బొమ్మిశెట్టి మధు, జిల్లా చేనేత సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజులు మాట్లాడుతూ.. ముడిసరుకు ధరలు, మార్కెట్ సమస్యలు, మధ్యవర్తుల దోపిడీ, ఉపాధి కొరతతో నేతన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకం నిజమైన నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేలా అమలు చేయాలని కోరారు. 3వ వార్డు చేనేత విభాగం నాయకుడు పురం సహదేవ, మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అర్హులైన నేతన్నల పేర్లు ఎందుకు మిస్ అవుతున్నాయో, గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. అర్హులైన ఒక్క నేతన్నకు కూడా అన్యాయం జరిగితే బాధితుల తరఫున పోరాటం చేస్తామని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా నేతన్నలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వైయస్ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు.