రాజమండ్రి: రాజమండ్రిలో మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను కారుతో దారుణంగా తొక్కి చంపిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాణి భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ కిరాతక హత్య వెనుక ఉన్న నిందితులను, వారికి అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు, కేసును నీరుగార్చేందుకు యత్నించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే... నిందితులు మూడు రోజులు ఎవరి రక్షణలో ఉన్నారు? రాజమండ్రి నడిబొడ్డున డాక్టర్ ప్రియాంకపై అతి కిరాతకంగా కారు ఎక్కించి హత్య చేస్తే, మూడు రోజుల పాటు ఈ అంశాన్ని వెలుగులోకి రాకుండా ఎవరు కప్పిపుచ్చారు? 3వ తారీఖున ఈ ఘోరం జరిగితే 6వ తారీఖున అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఈ మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు? ఎవరి రాచమర్యాదల్లో, ఎవరి రక్షణలో ఉన్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. కళ్లెదుట సీసీ ఫుటేజ్ విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంటే, మూడు సార్లు గుద్ది తలపై నుంచి కారు ఎక్కించుకెళ్తే, డిఎస్పీ ఆరో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఒక 'చిన్న యాక్సిడెంట్' జరిగింది అని నెరేటివ్ డ్రైవ్ చేయడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? మేము ప్రెస్ మీట్ పెట్టి ఇష్యూ లేవనెత్తే వరకు, సీసీ ఫుటేజ్‌లు కనబడుతున్నా స్టేషన్ బెయిల్ వచ్చే సింపుల్ సెక్షన్లు ఎందుకు పెట్టారు? నిందితులకు కొమ్ముకాయడం కాదా ఇది? హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరికి ఫోన్లు చేశారు? ఎవరి ప్రమేయంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చారో తేలాలి. మేము ఆర్‌టీఐ ద్వారా కాల్ డేటా రికార్డులు బయటకు తీస్తాం, నిందితుల కాల్ డేటాని పబ్లిక్‌లో పెట్టాలి. ఒక మనిషి ప్రాణం పోతే, స్థానిక ఎమ్మెల్యే బయటకొచ్చి ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ అని ఎలా ధృవీకరిస్తారు? అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసిందని అధికారిక పేజీలో పోస్ట్ పెట్టడానికి ఎమ్మెల్యే ఎవరు? అధికార పార్టీ ఒత్తిళ్లపై విచారణ చేయాలి.. నిందితులను కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నించారనే అనుమానాలు ఉన్నాయి. ఘటన జరిగిన రాత్రి నిందితులు ఎవరెవరికి ఫోన్లు చేశారో కాల్ డేటాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు ఎవరు ఆశ్రయం కల్పించారో, ఎవరి ఒత్తిడితో పోలీసులపై ప్రభావం పడిందో తేల్చాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పెట్టిన పోస్ట్, బాధితురాలి తమ్ముడు లేవనెత్తిన అనుమానాలు చూస్తుంటే, నిందితులను కాపాడేందుకు ఎమ్మెల్యేనే నేరుగా రంగంలోకి దిగినట్లు క్లియర్‌గా అర్థమవుతోంది. రాజమండ్రిలో ఓపెన్ ఎయిర్ థియేటర్ స్క్రీన్ మునిగితేనే కోడై కూసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు, రెండు రాష్ట్రాలను కుదిపేసిన ఇంత పెద్ద ఘటనపై ఎందుకు మూగబోయారు? పోస్టులు చేయొద్దని వారిపై ఎవరు ఒత్తిడి తెచ్చారో ఎంక్వయిరీ జరగాలి. సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి.. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రకాష్‌నగర్ సీఐ పాత్రపై కూడా సమగ్ర విచారణ జరపాలి. సీఐని తక్షణమే సస్పెండ్ చేసి, అవసరమైతే విచారణలో భాగంగా ప్రశ్నించాలి. నిందితుల విషయంలో పోలీసుల వ్యవహారశైలిపై కూడా దర్యాప్తు చేయాలి. డాక్టర్ ప్రియాంక ఘటనపై సీబీఐ విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలి. మహిళా కమిషన్ కూడా స్పందించాలి. దీనికోసం అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం. పాస్ అవుట్ అయిపోయిన నేరస్థులను, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని ప్రచారం చేస్తూ సీఐ బాజీలాల్ వారిపై సాఫ్ట్ కార్నర్ ముద్ర వేసే ప్రయత్నం ఎందుకు చేశారు? ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి బయలుదేరిన నిందితులు ఎటువైపు వెళ్లారు? ఎక్కడ షెల్టర్ పొందారో నగరంలో ఉన్న సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా సమాజానికి చెప్పాలి. బాధితురాలి తండ్రి కలెక్టర్ బంగ్లా వద్దకు వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ సీఐ ఆన్ డ్యూటీలో ఉండి కూడా గళ్ళ చొక్కా వేసుకుని, సివిల్ డ్రెస్‌లో ఎందుకు తిరుగుతున్నారు? ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. "ఈ ఘటనపై నేను, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ గారు సోషల్ మీడియాలో చేసిన పోస్టులను మెటాకి పంపించి ఎందుకు డిలీట్ చేయించారు? అందులో ఉన్న అన్‌డెమోక్రటిక్ కంటెంట్ ఏంటో చెప్పాలి. "ఢిల్లీ నిర్భయ, కోల్‌కతా అభయ ఘటనల తరహాలోనే రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటన జరిగింది. బాధితురాలి తండ్రి రోడ్డుపైకి వచ్చి ఆవేదన వెళ్లగక్కే వరకు ముఖ్యమంత్రి గానీ, ఉప ముఖ్యమంత్రి గానీ, హోం మంత్రి గానీ ఎందుకు నోరు విప్పలేదు?. ఈ విషయంలో నిజనిజాలు బయటపెట్టకపోతే, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం లాగే ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా పేకమేడలా కూలిపోతుంది. ఆ అమ్మాయి తెలంగాణ గద్వాలకు చెందిన డాక్టర్ అయినందుకే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించిందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్ష నేత కేటీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని తమ రాష్ట్ర బిడ్డకు న్యాయం జరిగేలా ఇక్కడ కేసు వేయించి పోరాడాలి. దారుణంగా హత్య చేయబడిన డాక్టర్‌కి రూ. 20 లక్షల నష్టపరిహారం ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. ఈ నేపధ్యంలో డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేవలం పరిహారం ఇచ్చి ఈ ఘటనను ముగించే ప్రయత్నం చేయకూడదని మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇంత తీవ్రమైన ఘటనపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని... నిందితుల అరెస్ట్, ఎఫ్‌ఐఆర్ నమోదు, సీసీ ఫుటేజ్, కాల్ డేటా, పోలీసుల దర్యాప్తు తదితర అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు డాక్టర్ ప్రియాంకకు జరిగిన అన్యాయంపై.. న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు.