తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాత జీవోలకే రంగులు మారుస్తూ, ఆక్వా రైతులను దగా చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ... ఆక్వా అథారిటీ చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ వర్గానికి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి రూ.1,000 కోట్ల భారీ లబ్ధి చేకూర్చేందుకు ‘పవర్ ఫ్యాక్టర్’ అనే నిబంధనను తెచ్చి చిన్న ఆక్వా రైతులపై మోయలేని భారాన్ని మోపారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా రూపాయిన్నరకే విద్యుత్ రాయితీ ఇస్తామని, ఫీడ్ ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేశారని స్పష్టం చేశారు. గతంలో వైఎస్. జగన్ హయాంలో 50,800 కనెక్షన్లను ఆక్వా జోన్‌లోకి తెచ్చి ఐదేళ్లలో రూ.3,640 కోట్ల విద్యుత్ రాయితీ ఇచ్చి ఆక్వా రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే నేటి కూటమి పాలనలో ఫీడ్ ధరలు పెరిగి, సబ్సిడీలు అందక ఆక్వా రైతులు రోడ్లపై రొయ్యలు పారబోసే తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులపై వేసిన రూ.1,000 కోట్ల భారాన్ని వెంటనే తొలగించకపోతే వైఎస్ జగన్ నాయకత్వంలో కోస్టల్ కారిడార్ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - పాత జీవోలకే రంగులు.. రైతులపై రూ.1,000 కోట్ల భారం. జీవో నెంబర్ 169 స్థానంలో కొత్తగా జీవో 57 తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, ఆ పాత జీవోలోని నిబంధనలనే మళ్లీ తిరగరాసి ఇచ్చారు తప్ప ఆక్వా రైతులకు కొత్తగా ఒరిగిన ప్రయోజనమేమీ లేదు. పవర్ ఫ్యాక్టర్ 0.92 నుంచి 0.95 వరకు 2027 మార్చి వరకు మెయింటెన్ చేస్తేనే సబ్సిడీ వస్తుందనడం దారుణం. ఒక్క హెక్టార్‌కు 50 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న పవర్ ఫ్యాక్టర్ పరికరాలు అమర్చుకోవాలంటే చిన్న రైతుకు రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల హెక్టార్లకు గాను ఆక్వా రైతులపై ఉమ్మడిగా రూ.1,000 కోట్ల భారీ భారం పడుతోంది. అధికార కూటమికి చెందిన పెద్దలు తమ సొంత వర్గానికి చెందిన ఒక ప్రైవేట్ ప్రాసెసింగ్ కంపెనీకి లబ్ధి చేకూర్చడానికే ఈ రూ.1000 కోట్ల దోపిడీ ప్లాన్ చేశారు. - కూటమి రాయితీల ఎగవేత - వైయస్.జగన్ హయాంలో చేయూత... ఎన్నికల ప్రచారంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా ప్రతి ఎకరాకు రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఏమైంది? జూన్ 1 నుంచి వర్తింపజేస్తామన్న రాయితీని ఇప్పటివరకు కరెంటు బిల్లుల్లో ఎందుకు సర్దుబాటు చేయలేదు? ఈ రెండు నెలల బిల్లుల పరిస్థితి ఏంటి?" గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్. జగన్ 64 వేల కనెక్షన్లలో 50,800 కనెక్షన్లను ఆక్వా జోన్‌లోకి తీసుకొచ్చి, ఐదేళ్ల కాలంలో రూ.3,640 కోట్ల విద్యుత్ రాయితీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మిగిలిన 12 వేల కనెక్షన్లకు కూడా వెంటనే సబ్సిడీ వర్తింపజేయాలి. - సంక్షోభంలో ఆక్వా రంగం.. రోడ్డున పడ్డ రైతన్నలు.. ఆక్వా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడంతో టన్నుల కొద్దీ రొయ్యలను రోడ్లపై పారబోసి, నిరసనలు తెలిపే దుస్థితి వచ్చింది. ముఖ్యమంత్రే స్వయంగా ఆక్వా అథారిటీ చైర్మన్‌గా ఉండి ఏం చేస్తున్నారు? ప్రభుత్వ పెద్దలు, నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సాధించిందేమిటి? ఫీడ్ ధరలు ఎంత తగ్గించారో రైతులకు స్పష్టంగా చెప్పాలి. బీజేపీ నేతలు కూడా ఆక్వా రంగంలో ఒక నిర్దిష్ట వర్గం పెత్తనం నడుస్తోందని బహిరంగంగానే చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దల నోళ్లు ఎందుకు మూగబోయాయి? - వైయస్. జగన్ అడుగుపెడితేనే రైతుకు లాభం.... వైఎస్.జగన్ మోహన్ రెడ్డి భీమవరం పర్యటనకు వచ్చి రైతులకు అండగా నిలబడటంతోనే, కుదేలైన ఆక్వా మార్కెట్‌లో 100 కౌంట్ రొయ్యల ధర రూ.245 నుంచి రూ.275కి పెరిగింది. ఇది జగన్ పోరాటానికి లభించిన ప్రత్యక్ష ప్రయోజనం. అలాగే, దేవరపల్లి పర్యటనలో పొగాకు రైతులకు ఆయన సంఘీభావం తెలిపిన తర్వాతే పొగాకు ధరలు రూ.260 నుంచి రూ.300 వరకు పెరిగాయి. వైయస్.జగన్ రైతుల వద్దకు వస్తే తమ పాపాలు బయటపడతాయని, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రభుత్వం హడావుడిగా అసత్యపు జీవోలను తెస్తోంది. - సీబీఐ విచారణకు భయమెందుకు?.. కేవలం రైతులే కాదు.. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను కూడా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలపై వైఎస్ జగన్ పక్కా ఆధారాలు చూపించినా, ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? తప్పు చేయకపోతే విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో లెక్కలు చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆక్వా రైతులకు తీవ్ర భారాన్ని తెచ్చిపెడుతున్న పవర్ ఫ్యాక్టర్ నిబంధనను వెంటనే తొలగించాలని, జూన్ నుంచి విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీని సర్దుబాటు చేయాలని వడ్డీ రఘురాం డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో కోస్టల్ కారిడార్ పొడవునా పెద్దఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని వడ్డీ రఘురాం హెచ్చరించారు.