వైయ‌స్ జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి అక్రమ కేసులు

 చింతాడ రవికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ 

శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై నమోదైన కేసుల నేపథ్యంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ బుధవారం రావికంటిపేటలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవికుమార్ తల్లి చింతాడ శ్యామలమ్మ, తమ్ముడు చింతాడ కృష్ణలను కలిసి ధైర్యం చెప్పారు.

వైయ‌స్‌ జగన్ ప్రజాదరణను చూసి భయపడుతోంది ప్రభుత్వం

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారని అన్నారు. ఆ జనసందోహం పార్టీ సమీకరించినది కాదని, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ప్రజలకు ఉన్న అనుబంధం, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పాలన పట్ల ఉన్న విశ్వాసమే ఈ ఆదరణకు కారణమని పేర్కొన్నారు.

 ప్రజల ప్రేమను కేసులతో అడ్డుకోలేరు

ఒకేచోట భారీగా జనసమీకరణ జరగకుండా పార్టీ ముందుగానే కార్యకర్తలకు సూచనలు చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని ధర్మాన చెప్పారు. ఈ ఘటనను సాకుగా చూపుతూ చింతాడ రవికుమార్‌తో పాటు సుమారు 20 మంది నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని విమర్శించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని విధుల్లో ఉన్న పోలీసు అధికారులు చెబుతున్నప్పటికీ కేసులు నమోదు చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.

  పోలీసులను రాజకీయాలకు వాడొద్దు

పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ధర్మాన ప్రసాదరావు అన్నారు. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, ప్రభుత్వాల ఒత్తిళ్లకు లోనుకాకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీకి పోలీసు శాఖతో ఎలాంటి విభేదాలు లేవని, ప్రజా వ్యతిరేక విధానాలపైనే తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

  ప్రజా వ్యతిరేక పాలనపై అసంతృప్తి పెరుగుతోంది

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని ధర్మాన అన్నారు. ఆ అసంతృప్తిని ఎదుర్కొనే బదులు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. "గుండెపై చేయి వేసుకుని చెప్పండి... అక్కడ హత్యాయత్నం జరిగిందా? అక్కడున్న అధికారులే ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని చెబుతున్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి రావడం ప్రభుత్వానికి హెచ్చరిక. ప్రజలు ఎందుకు వస్తున్నారో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి" అని ధర్మాన వ్యాఖ్యానించారు.

 చింతాడ రవికుమార్ కుటుంబానికి పార్టీ అండ

మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చింతాడ రవికుమార్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. చింతాడ రవికుమార్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ ద్వారా పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందించి అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top