దేవరపల్లి : రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా మారిందని, గత 27 నెలల పాలనలో రైతులకు గిట్టుబాటు ధర, భరోసా, ప్రభుత్వ అండ ఏదీ దక్కలేదని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు యార్డును సందర్శించి రైతులతో ముఖాముఖి అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 67 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిందన్నారు. పొగాకు రైతుల నుంచి వరి, పత్తి, కొబ్బరి, మిర్చి, ఉల్లి, టమాటా వరకు అన్ని పంటల రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో శ్రీ వైయస్ జగన్ గారు ఏమన్నారంటే.. - 27 నెలల పాలనలో రైతులే పెద్ద బాధితులు ఈ రాష్ట్రంలో 67 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో గత 27 నెలలుగా ఒక్క రైతుకైనా, ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర దక్కలేదు. వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చెరకు... ఏ పంటను తీసుకున్నా రైతు నష్టాల్లోనే ఉన్నాడు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోయింది. రైతు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, వేధింపులతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. - పొగాకు రైతులను ప్రభుత్వం మోసం చేసింది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో పొగాకు సగటు ధర కిలోకు రూ.289 ఉండేది. గరిష్ట ధర రూ.411 వరకు నమోదైంది. కానీ ఈరోజు అదే సగటు ధర రూ.214కు పడిపోయింది. ఉత్తరాది ప్రాంతంలో రూ.326 ఉన్న ధర ఇప్పుడు రూ.236కు క్షీణించింది. ఇవి నా లెక్కలు కాదు... భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన అధికారిక గణాంకాలు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా రైతుకు వచ్చే ఆదాయం మాత్రం భారీగా తగ్గిపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. - టొబాకో బోర్డు హామీలు ఏమయ్యాయి? టొబాకో బోర్డు 142 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామని రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల ఉత్పత్తిలో కేవలం 21 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. ఉత్తరాది ప్రాంతంలో 83 మిలియన్ కిలోల ఉత్పత్తి కాగా 105 రోజుల వేలంలో కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కిలోలే. రైతుల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఉన్నాయి. వేలాల్లో 'నో బిడ్స్' పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, 30 నుంచి 40 శాతం వరకు రిజెక్ట్ చేస్తున్నారు. - దళారులకే అండ... రైతుకు కాదు కొనుగోలు వ్యవస్థ వెనుక దళారుల సిండికేట్ పనిచేస్తోందని రైతులే చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ఒక్క కొనుగోలుదారునిపై కూడా చర్య తీసుకోలేదు. మార్క్‌ఫెడ్‌ను పోటీ కొనుగోలుదారుగా మార్కెట్‌లోకి తీసుకురాకపోవడంతో కంపెనీలు రైతులను దోచుకుంటున్నాయి. పైగా కంపెనీలకు కిలోకు రూ.20 సబ్సిడీ ఇస్తూ రైతుకు మరింత నష్టం చేస్తున్నారు. రైతును కాపాడాలంటే వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి, ప్రతి గ్రేడ్‌కు కనీస మద్దతు ధర ప్రకటించి, మార్కెట్‌లో పోటీ వాతావరణం తీసుకురావాలి. - మా ప్రభుత్వంలో రైతుకు పూర్తి భరోసా మా ప్రభుత్వం హయాంలో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులకు ప్రతి గ్రేడ్‌కు కనీస ధర లభించింది. రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, ఐదేళ్లలో రూ.7,800 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. 84 లక్షల 66 వేల మంది రైతులకు రూ.2,050 కోట్ల మేర సున్నా వడ్డీ ప్రయోజనం అందించాం. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, వ్యవసాయ ప్రయోగశాలల ద్వారా రైతుకు అండగా నిలిచాం. రైతు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఆదుకుంది. - ఎన్నికల హామీలన్నీ బూటకమే ఎన్నికల సమయంలో ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్‌కు అదనంగా సంవత్సరానికి రూ.20 వేల చొప్పున 'అన్నదాత సుఖీభవ' ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లలో ఒక్కో రైతుకు రూ.60 వేల రావాలి. కానీ ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.19 వేలే. అంటే ఒక్కో రైతుకు రావాల్సిన రూ.41 వేల ఎగవేశారు. అంతేకాదు, 7 లక్షల మంది రైతులను పథకం నుంచి తొలగించారు. కౌలు రైతులను, అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న గిరిజన రైతులను కూడా అన్యాయంగా బయటపెట్టారు. సున్నా వడ్డీ పథకం, ఉచిత పంటల బీమా, రైతు భరోసా కేంద్రాలను కూడా నిర్వీర్యం చేశారు. - రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం గిట్టుబాటు ధర లేక, పంట అమ్ముకోలేక బుట్టాయిగూడెంకు చెందిన రైతు వెంకటేశ్వరరావు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ కూడా వెళ్లలేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వలేదు. రైతుల ఆత్మహత్యలను సాధారణ సంఘటనలుగా చూడకూడదు. రైతు ప్రాణానికి విలువ ఇవ్వాలి. రైతు కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. - రైతు కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు, కొనుగోలు వ్యవస్థ సక్రమంగా జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్క్‌ఫెడ్‌ను బలోపేతం చేస్తాం. కనీస గిట్టుబాటు ధర హామీ ఇస్తాం. పారదర్శక కొనుగోలు వ్యవస్థను అమలు చేస్తాం. దళారుల ఆధిపత్యాన్ని పూర్తిగా అరికడతాం. రైతు కష్టానికి తగిన విలువ దక్కే విధంగా విధానాలు అమలు చేస్తాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు హక్కుల కోసం మా పోరాటం ఆగదు. రైతు గెలవాలి... రైతు బతకాలనే లక్ష్యంతో వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ రైతు పక్షాన నిలుస్తుంది.