జెఎన్‌టీయూ (జీవీ) తొలి స్నాతకోత్సవం విజయనగరంలో నిర్వహించాలి

రాష్ట్ర గవర్నర్‌కు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి

గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌కు లేఖ రాసిన బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: జేఎన్‌టీయూ (గురజాడ–విజయనగరం) తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించాలన్న నిర్ణయంపై శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో వెనకబడిన ప్రాంతమైన విజయనగరంలో జెఎన్‌టీయూ (జీవీ) ఉన్నందువల్ల, అక్కడే తొలి స్నాతకోత్సవం నిర్వహించాలని ఆయన కోరారు. అందువల్ల జెఎన్‌టీయూ (జీవీ) తొలి స్నాతకోత్సవ వేదికపై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు విజ్ఞప్తి చేశారు. 
    ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసిన బొత్స సత్యనారాయణ, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలోని విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను తీర్చేందుకు జేఎన్‌టీయూ (జీవీ) ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలాంటి విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించాల్సింది పోయి విశాఖపట్నంలో నిర్వహించడం సముచితం కాదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, మరో కొద్ది నెలల్లో శాశ్వత ప్రాంగణం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నప్పుడు ఇంత తొందరపడి విశాఖలో స్నాతకోత్సవాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
    జెఎన్‌టీయూ (జీవీ) తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరం వెలుపల నిర్వహించడం వల్ల జిల్లా ప్రజలు తమ విశ్వవిద్యాలయానికి సంబంధించిన చారిత్రాత్మక ఘట్టాన్ని కోల్పోతున్నారని, వారి గౌరవం, ఆనందానికి భంగం కలుగుతోందని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై విజయనగరం జిల్లాలో అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.
    వీటన్నింటి నేపథ్యంలో, విజయనగరం ప్రజల భావోద్వేగాలు, అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని జెఎన్‌టీయూ (జీవీ) తొలి స్నాతకోత్సవ వేదికపై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తన లేఖలో గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌కు విజ్ఞప్తి చేశారు.

Back to Top