బనగానపల్లె: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని ప్రకటిస్తూ, అదే పథకానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన భూ సర్వే, డిజిటల్ పాస్ పుస్తకాల వ్యవస్థకు కేవలం రంగు మార్చి కొత్త కార్యక్రమంగా ప్రచారం చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని ఆయన అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల "మీ భూమి–మీ హక్కు" కార్యక్రమంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని ప్రకటించడం వాస్తవాలకు విరుద్ధమని విమర్శించారు. చట్టాన్ని రద్దు చేసినట్లు చెబుతూనే అదే పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు స్వీకరించడం విరుద్ధమైన వైఖరని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక భూ సర్వే, డిజిటల్ పాస్ పుస్తకాల కార్యక్రమానికే ఇప్పుడు మొదటి పేజీ మార్చి కొత్త కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులను అత్యాధునిక సాంకేతికతతో సర్వే చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అధిక శాతం పనులు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గతంలో జలయజ్ఞాన్ని విమర్శించిన వారే ఇప్పుడు అదే ప్రాజెక్టులకు తామే శ్రీకారం చుట్టామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాటసాని రామిరెడ్డి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో మంజూరైన రహదారులు, బీసీ హాస్టల్, ఆలయ అభివృద్ధి, తాగునీటి పథకాలు, ఇతర మౌలిక వసతుల పనులను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.