తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మెడలో నల్ల కండువాలు ధరించి ర్యాలీగా శాసనమండలికి బయలుదేరిన ఎమ్మెల్సీలు.. డీఎస్సీపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. డీఎస్సీపై విచారణ చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ” అంటూ నినాదాలతో నిరసన చేపట్టారు. శాసనమండలిలోకి చేరుకున్న అనంతరం పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. మండలి వాయిదా పడినా నిరసనను విరమించకుండా నేలపై కూర్చొని డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలని పట్టుబట్టారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీపై చర్చ జరపాలని కోరుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం చర్చకు భయపడుతోందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి లోకేష్ చెబుతున్నారని తెలిపారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి కోరిన టీచర్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. తక్షణమే టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని, డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. జీవోలతో అక్రమాలకు మార్గం: ఎమ్మెల్సీ మధుసూధన్ ఎమ్మెల్సీ మధుసూధన్ మాట్లాడుతూ గతంలో 2 శాతంగా ఉన్న స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచారని తెలిపారు. డీఎస్సీకి ముందు ఒక జీవో, ఆ తర్వాత మరో జీవో తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆ జీవోలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీలో ఉద్యోగాల కోసం లక్షల్లో బేరసారాలు జరిగాయని పేర్కొంటూ.. డీఎస్సీపై విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధం కావాలని స్పష్టం చేశారు. విచారణకు భయపడి పారిపోతున్నారు: ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు, సమావేశాలు జరగలేదని అన్నారు. డీఎస్సీపై విచారణ జరిపించాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సభలో చర్చ జరిపే వరకు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీపై సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్సీపై చర్చ జరపకుండా ప్రభుత్వం ఎంతకాలం తప్పించుకున్నా తమ పోరాటం ఆగదని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై శాసనమండలిలో సమగ్ర చర్చ జరిపి, సీబీఐ విచారణకు ఆదేశించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.