నెల్లూరు జిల్లా: పొదలకూరు మండలం నేదురుమల్లి గ్రామంలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానికులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్తులు కాకాణి దృష్టికి తీసుకువచ్చారు. నేతన్నల పరిహారంలో వసూళ్లా? సర్వేపల్లి నియోజకవర్గంలో నేతన్నలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 వేల పరిహారంలో ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల చొప్పున వసూలు చేయడం దుర్మార్గమని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. తాము సిద్ధమని ప్రతి సవాల్ విసరగానే ఆయన వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు వాటిని పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతుల శ్రమకు గిట్టుబాటు ధర ఏది? రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుండగా, దళారులు, వ్యాపారులు, మిల్లర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి కూటమి పాలనలో నెలకొందని కాకాణి అన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి తరహాలో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారం లేకపోయినా వైయస్ఆర్‌సీపీ నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారని, అవసరమైతే సొంత నిధులు ఖర్చు చేస్తున్నారని అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం గ్రామపంచాయతీలకు నిధులు ఉన్నప్పటికీ వాటిని ప్రజా సంక్షేమానికి వినియోగించకుండా రాజకీయ జోక్యంతో దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాకాణి అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి వైయస్ఆర్‌సీపీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ నాయకుడు చేవూరు చంద్రమౌళి కుమార్తె భార్గవి ముందస్తు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు.