డీఎస్సీపై చర్చకు భయమెందుకు?

ఆధారాలతో సభ ముందుకు రావాలి

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి: ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్పలత

తాడేపల్లి: డీఎస్సీ అంశంపై శాసనమండలిలో చర్చకు ప్రభుత్వం నాలుగు రోజులుగా వెనుకడుగు వేస్తోందని ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్పలత అన్నారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ నియామకాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడే అక్రమాలు జరిగాయా లేదా అన్నది తేలుతుందని స్పష్టం చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. డీఎస్సీపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. మండలిలో చర్చకు వస్తే ఆధారాలతో అక్రమాలను బయటపెడతామని తెలిపారు. డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, వాటిని కప్పిపుచ్చేందుకే చర్చను తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.

వైయ‌స్‌ జగన్‌కు భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు

ప్రతిపక్ష హోదా ఇస్తే వైయస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తారని, ఆయన సభలో అడుగుపెడితే కూటమి ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయని వరుదు కళ్యాణి అన్నారు. వైయస్‌ జగన్‌కు భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని పేర్కొన్నారు. డీఎస్సీపై చర్చ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అక్రమాల కోసమే నిబంధనలు మార్చారా?

చంద్రబాబు గతంలో డీఎస్సీలు నిర్వహించినప్పుడు స్పోర్ట్స్‌ కోటా ఎందుకు అమలు చేయలేదని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. అక్రమాలకు అవకాశం కల్పించేందుకే జీవోలను మార్చుకున్నారని పేర్కొన్నారు. పీవీ సింధుకు ఉద్యోగం ఇచ్చిన ఉదాహరణను చూపిస్తూ స్పోర్ట్స్‌ కోటాలో నియామకాలు చేపట్టామని చెప్పడం సరికాదన్నారు. 
డీఎస్సీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, అయితే డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ నియామకాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అర్హత లేకుండానే ఏపీపీఎస్సీలో ఎంపికైన వ్యక్తిని కుప్పం ఆర్డీవోగా నియమించారా అనే అంశంపైనా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు

రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసి, అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వరుదు కళ్యాణి అన్నారు. రెండేళ్లలో రైతులు, మహిళలు, విద్యార్థులను మోసం చేశారని పేర్కొన్నారు. డీఎస్సీపై చర్చ జరగాల్సిందేనని, లోకేష్‌ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

పారదర్శకంగా జరిగితే సీబీఐ విచారణకు భయమెందుకు?

ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ.. డీఎస్సీ పారదర్శకంగా జరిగితే మంత్రి లోకేష్‌ చర్చకు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించినట్లయితే సభలో తమ ముందు అన్ని ఆధారాలను పెట్టాలని సవాల్‌ చేశారు. టీడీపీ హయాంలో డీఎస్సీ నిర్వహించి మధ్యలో అభ్యర్థులను వదిలేయడం ఆనవాయితీగా మారిందని, 1998 డీఎస్సీ అభ్యర్థులకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతే న్యాయం జరిగిందని తెలిపారు.

 డీఎస్సీలో శాప్‌ జోక్యం ఎందుకు?

డీఎస్సీ నిర్వహణలో శాప్‌కు ఏమి సంబంధమని కల్పలత ప్రశ్నించారు. డీఎస్సీలో శాప్‌ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించేందుకే శాప్‌ను డీఎస్సీలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం తగదని అన్నారు.

 మెగా డీఎస్సీ పేరుతో మోసం

వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 54 వేల పోస్టులతో నిర్వహించిన డీఎస్సీని మెగా డీఎస్సీగా పరిగణించారని కల్పలత తెలిపారు. కేవలం 16 వేల పోస్టులతో నిర్వహించిన డీఎస్సీకి మెగా డీఎస్సీ అనే పేరు పెట్టడం సరికాదన్నారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ నియామకాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అది చేయలేని పక్షంలో ఆయన ఈరోజు నిర్వహించే మీడియా సమావేశంలో లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పేందుకు అధికారులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. డీఎస్సీపై సభలో సమగ్ర చర్చ జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైయస్సార్‌సీపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుందని తెలిపారు.
 

Back to Top