డీఎస్సీ అక్రమాలపై సమాధానాలు చెప్పకుండా లోకేష్ సవాళ్లు విసురుతున్నారు

  విద్యార్థుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

అమ‌రావ‌తి:  డీఎస్సీ నియామక ప్రక్రియలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ కన్వీనర్‌గా, ఎస్సీఆర్టీ డైరెక్టర్‌గా ఒకే వ్యక్తిని నియమించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. బుధ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ చెబుతున్న మాటలకు విద్యాశాఖ అధికారులు చెబుతున్న విషయాలకు పొంతన లేదని పేర్కొన్నారు. ఎన్‌ఓసీ తీసుకోలేదని లోకేష్ చెబుతుంటే, ఎన్‌ఓసీ తీసుకున్నామని చెబుతూ నవీన్ కోర్టును ఆశ్రయించారని తెలిపారు. డీఎస్సీ ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

లోకేష్ అసెంబ్లీలో సవాళ్లు విసురుతున్నారు తప్ప ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తనను ఎవరూ ప్రశ్నించరనే ధైర్యంతో అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, మరి శాసనమండలిలో డీఎస్సీ అంశంపై చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్‌గా ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదంటున్న ప్రభుత్వం.. ఆ వ్యవస్థలో ఇలాంటి కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి ఎందుకు అప్పగించిందో చెప్పాలని అన్నారు. పీవీ సింధుకు ఉద్యోగం ఇవ్వడం, స్పోర్ట్స్ కోటాలో జరిగిన ఇతర నియామకాలకు ఒకే నిబంధన వర్తిస్తుందా అని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. పీవీ సింధుకు ఇచ్చిన విధంగానే కోట్ల రూపాయల నగదు, స్థలం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారందరికీ ఇస్తారా అని నిలదీశారు. బ్రిడ్జి గేమ్‌ పేరుతో జరుగుతున్న వ్యవహారంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. బ్రిడ్జి గేమ్‌ను క్రికెట్ బ్యాట్‌తోనా, వాలీబాల్‌తోనా ఆడతారా.. పేకలతో ఆడే ఆటకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.

విద్యాశాఖ, శాప్ అధికారులను ఎందుకు బదిలీ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అధికారులందరినీ బదిలీ చేసిన తర్వాత మిగిలింది లోకేష్ ఒక్కరేనని, అధికారులను బదిలీ చేసినప్పుడు లోకేష్‌ను కూడా పదవి నుంచి తొలగించాలి కదా అని ప్రశ్నించారు. డీఎస్సీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎంత దూరం పారిపోయినా విద్యార్థుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజల ముందు ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు, యువతే మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top