గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు చింతా అనురాధ భరోసా

ఆచూకీ లభించే వరకు అండగా ఉంటాం.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి

అమలాపురం: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మాజీ ఎంపీ చింతా అనురాధ పరామర్శించి ధైర్యం చెప్పారు. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి వెళ్లిన ఆమె బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకుని, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఓడలరేవుకు చెందిన కోపనాతి రామకృష్ణవర్మతో పాటు మరో ఆరుగురు మత్స్యకారులు ఆగస్టు 3న టోనా ఫిష్ వేటకు సముద్రంలోకి వెళ్లారు. ఆగస్టు 12న తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే గాలింపు చర్యలను ముమ్మరం చేసి మత్స్యకారుల ఆచూకీ కనుగొనేలా చర్యలు తీసుకోవాలని చింతా అనురాధ కోరారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా కూడా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట కొనుకు గౌతమి, ఇళ్ల శేషారావు, కొనుకు బాపూజీ తదితరులు ఉన్నారు.
 

Back to Top